challans collect
-
చలానా కుంభకోణంలో ఒక్కరే సూత్రధారి?
సాక్షి, తూర్పుగోదావరి: అన్నీ తానయ్యాడు.. అందరినీ నమ్మించాడు.. అవకాశం చూశాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. నకిలీ చలానా కుంభకోణానికి పాల్పడ్డాడు.. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చలానాల అవకతవకల కేసులో సూత్రధారి ఒక్కడేనని తెలుస్తోంది. రాష్ట్రంలో చలానా కుంభకోణం బయట పడిన తరువాత జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆలమూరులో చలానా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 20 వరకూ 2,388 రిజిస్టేషన్లు జరగ్గా, వీటిలో 39 బోగస్‌గా నిర్ధారించి రూ.7,31,510 దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఈ లావాదేవీలన్నీ ఓ అనధికార ఉద్యోగికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. కుంభకోణానికి అసలు సూత్రధారి అని భావిస్తున్న ప్రైవేటు ఉద్యోగి నుంచే దుర్వినియోగమైన సొమ్మును సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది రికవరీ చేసినా, అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బోగస్ చలానా కుంభకోణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ ఉద్యోగి సహకరించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయట పడిన వెంటనే అతడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు అందరిదీ ఆ మాటే.. చలానా కుంభకోణంపై ఎట్టకేలకు ఫిర్యాదు అందడంతో ఆలమూరు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్, ఎస్సై ఎస్.శివప్రసాద్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్టార్ ఎ.సునందశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోగస్ చలానా దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేసేందుకు వచ్చిన సీఐ శివగణేష్‌కు దస్తావేజు లేఖర్లంతా ఆ అనధికార ఉద్యోగి పైనే ఫిర్యాదు చేశారు. బోగస్‌గా తేల్చిన చలానాలన్నీ రెండు బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని, వాటిల్లో పొందుపరచిన ఫోన్ నంబర్లు కూడా అతడివేనని చెప్పారు. దుర్వినియోగమైన సొమ్ము కూడా అతడి ఖాతా నుంచే రికవరీ అయ్యిందని తెలిపారు. బోగస్‌గా గుర్తించిన 39 చలానాల్లో అత్యధికంగా డి.దుర్గాప్రసాద్ 30, వై.శ్రీరామచంద్రమూర్తి 6, పి.భగవాన్, టి.జి.కృష్ణకు చెందిన ఒక్కొక్కటి ఉన్నాయి. పినపళ్లకు చెందిన కె.వెంకటరమణకు చెందిన బ్యాంకు డాక్యుమెంటూ బోగస్ చలానాలో ఉంది. కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ చెప్పారు. చదవండి: ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ అన్నీ అతనై.. కంప్యూటర్ వర్క్‌లో నిష్ణాతుడు కావడంతో అత్తిలి నవీన్‌కుమార్ అనే వ్యక్తిని ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అనధికారికంగా రోజువారీ వేతనంపై నియమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగంగా చేస్తాడనే కారణంగా కొంతమంది దస్తావేజు లేఖర్లు కూడా బ్యాంకుకు వెళ్లే పని లేకుండా నేరుగా అతడికే సొమ్ము చెల్లించి, అతడి బ్యాంకు ఖాతా ద్వారానే చలానాలు తీసుకునేవారు. ఇదే అదనుగా అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీఎఫ్ఎంఎస్ విధానంలో పీడీఎఫ్‌లో ఉన్న చలానాను మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోకి మార్చి రూ.లక్షల అక్రమాలకు పాల్పడ్డాడని సమాచారం. సబ్ రిజిస్టార్ కార్యాలయ అధికారులకు నమ్మకంగా ఉంటూ ఓ ఉద్యోగి లాగిన్ నుంచే బోగస్ చలానాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, కొంతమంది దస్తావేజు లేఖర్ల స్వార్థంతో 39 చలనాల్లో అక్రమాలకు ఇతడు కారణమయ్యాడు. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయిలా.. ► ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 20 వరకూ రిజిస్ట్రేషన్లు: 2,388 ► వీటిలో బోగస్ చలానాలు : 39 ► రికవరీ చేసినది : రూ.7,31,510 -
తెలంగాణలో చలాన్ పుస్తకాలకు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహనాలను ఆపి తమ చేతిలో ఉన్న పుస్తకంలో రాసి చలాన్ జారీ చేయడం... అది కట్టించుకునే నెపంతో ‘చేతివాటం’ చూపించడం... కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు తావివ్వడం... ఇకపై ఇలాంటి సీన్లు రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు. ప్రస్తుతం రాజధానికి మాత్రమే పరిమితమైన నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేపట్టిన పోలీసు విభాగం ఇప్పటికే 18 యూనిట్లలో (జిల్లా, కమిషనరేట్) దీనిని అమలులోకి తీసుకొచ్చింది. గరిష్టంగా వారం రోజుల్లో మిగిలిన తొమ్మిదింటిలోనూ అమలు చేయనున్నారు. ఈ క్రతువు పూర్తయితే పూర్తిస్థాయి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది. వివాదాలు, ఘర్షణలకు తావు లేకుండా... ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలులో ఉండేవి. ఇందులో భాగంగా చలాన్ పుస్తకాలు పట్టుకుని రంగంలోకి దిగే ట్రాఫిక్/శాంతిభద్రతల విభాగం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధించడంతో పాటు జరిమానా వసూలు చేసేవారు. దీనివల్ల వాహనచోదకులతో తరచు ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకునేవి. వీటికి తోడు పోలీసులు సైతం చేతివాటం ప్రదర్శించడంతో అవినీతికీ ఆస్కారం ఉండేది. 2014లో నగర పోలీసు కమిషనర్‌గా నియమితులైన ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఆయన చొరవతో 2015 జనవరి 20 నుంచి హైదరాబాద్‌లో ఇది అమలులోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులు అమలులోకి తీసుకువచ్చారు. 2016 నవంబర్ నుంచి రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్‌రెడ్డి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. సన్నాహాలు తుదిదశకు చేరిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆ హడావుడి పూర్తి కావడంతో శరవేగంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పీడీఏలతో పని లేకుండా... నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానంలో సాధారణంగా ఏ పోలీసు అధికారి రోడ్డుపై వాహనాలను ఆపరు. కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనులకు టికెట్ ద్వారా చలాన్ జారీ చేసినా డబ్బు మాత్రం కట్టించుకోరు. తమ దృష్టికి వచ్చిన ఉల్లం«ఘనలను ఫొటోలో బంధించి ఆయా జిల్లాలు, కమిషనరేట్ల లోని కంట్రోల్రూమ్స్కు అప్లోడ్ చేస్తారు. రహదారుల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారానూ కంట్రోల్ రూమ్ అధికారులు ఉల్లంఘనుల ఫొటోలు క్యాప్చర్ చేస్తారు. అక్కడి సిబ్బంది ఆ వాహనం నంబర్ ఆధారంగా ఆర్టీఏ కార్యాలయంలో నమోదైన చిరునామా ఆధారంగా వాహనచోదకుడికి ఈ–చలాన్ జారీ చేసి పోస్టులో పంపిస్తారు. ఈ మొత్తాన్ని ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, కొన్ని బ్యాంకులు, ఆన్‌లైన్‌తో పాటు నిర్దేశించిన మార్గాల్లో వాహనచోదకుడే స్వయంగా చెల్లించాలి. చిరునామా తప్పుగా ఉండటం, మారిపోవడం తదితర కారణాలతో ఈ–చలాన్ వాహనచోదకుడికి అందకపోతే... పెండింగ్‌లో ఉన్న వాటిని (www.echallan.org) వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు. పెండింగ్ చలాన్లు ఉన్న వారిని తనిఖీ చేయడానికి ఒకప్పుడు పీడీఏ మిషన్లు అవసరం ఉండేది. ఇవి పెండింగ్ డేటాబేస్‌తో అనుసంధానమై ఉండేవి. తాజాగా ఈ డేటాబేస్‌ను ‘టీఎస్ కాప్’ యాప్‌తో అనుసంధానించారు. ఫలితంగా పోలీసులు తమ స్మార్ట్‌ఫోన్ ట్యాబ్ ద్వారానే ఫొటోలు తీసి అప్లోడ్ చేయడం, పెండింగ్‌వి తనిఖీ చేయడం సాధ్యమవుతోంది. రాష్ట్రం మొత్తం ఒకే డేటాబేస్... హైదరాబాద్‌లో అమలులో ఉన్న విధానాలు నేపథ్యంలో ఇక్కడ వాహనం జాగ్రత్తగా నడిపే వ్యక్తి వేరే జిల్లాకు వెళితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అక్కడ ఈ–చలాన్ విధానం లేకపోవడం, ఉన్నా ఆ వివరాలు అక్కడి పోలీసులకు తెలియకపోవడమే దీనికి కారణం. అయితే తాజాగా రాష్ట్ర పోలీసులు విభాగం రాష్ట స్థాయిలో ఒకే డేటాబేస్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 27 పోలీసు యూనిట్లూ అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడ ఉల్లంఘనకు పాల్పడినా చిక్కడం, జరిమానా చెల్లించడం తప్పనిసరిగా మారుతోంది. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కీలక కారకంగా ఉన్న మద్యం తాగి వాహనాలు నడపడాన్నీ నిరోధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు తప్పనిసరి చేయడంతో పాటు హైదరాబాద్‌లో అమలులో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను (ఎస్ఓపీ) అన్నింటిలోనూ అమలు చేయనున్నారు. వీటి ప్రకారం ఇకపై ఈ ఉల్లంఘనకు పాల్పడి చిక్కిన వారు కచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే. -
మందుబాబులు చెల్లించిన జరిమానా రూ.26 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఈ నెల మొదటి పక్షంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన మందుబాబులు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాల రూ.26,95,500. దీంతో పాటు సెల్‌ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం తదితర ఉల్లంఘనలకు సంబంధించి 15 రోజుల్లో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్స్‌లో మొత్తం 1244 మంది పట్టుబడ్డారు. వీరిలో 289 మంది జైలుకు వెళ్లగా, 10 మంది డ్రైవింగ్ లైసెన్సులను (డీఎల్స్) శాశ్వతంగా, 61 మందివి నిర్ణీత కాలానికి రద్దు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. డ్రంక్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కిన వారు మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు పది మంది డ్రైవింగ్ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... ఐదుగురివి ఐదేళ్లు, నలుగురివి నాలుగేళ్లు, 19 మందివి మూడేళ్లు, పది మందివి రెండేళ్లు, 20 మందివి ఏడాది, ముగ్గురివి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి రెండు నెలలు, ఇద్దరికి నెల, ఒకరికి 25 రోజులు, ఆరుగురికి 20 రోజులు జైలు శిక్ష పడింది. వీరితో పాటు మరో ఇద్దరికి 15 రోజులు, ఆరుగురికి పది రోజులు, ఒకరికి తొమ్మిది రోజులు, ఇద్దరికి ఎనిమిది రోజులు, 11 మందికి వారం, ఏడుగురికి ఆరు రోజులు, 30 మందికి ఐదు రోజులు, 36 మందికి నాలుగు రోజులు, 58 మందికి మూడు రోజులు, 117 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించినట్లు ఆయన వివరించారు. డ్రంక్ డ్రైవింగ్‌తో పాటు మరో రెండు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్షీట్లు వేస్తున్నామని, వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసిన 7 మందికి రెండు రోజులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం నేరంపై ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించినట్లు ట్రాఫిక్ చీఫ్ వివరించారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సిలింగ్స్ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని అనిల్‌కుమార్ హెచ్చరించారు. -
చేయి చాచి.. టోలుతీసి!
గుత్తి: టోల్ ప్లాజా వద్ద డ్యూటీలు చేస్తున్న కొందరు పోలీసులు అక్రమార్జనకు తెరలేపారు. పశువులు, భారీ లోడుతో వెళ్లే వాహనాలను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకు దండుకుంటున్నారు. గుత్తి టోల్‌ప్లాజా వద్ద రోజూ పెద్దవడుగూరుకు చెందిన ఇద్దరు పోలీసులు డ్యూటీలో ఉంటారు. వీరిలో కొందరు వాహన డ్రైవర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే.. కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఎప్పటికప్పుడు చీడలను ఏరివేసే ప్రయత్నం చేస్తున్నా.. కొందరు పోలీసుల కారణంగా శాఖ పరువు బజారున పడుతోంది. బలవంతంగా రూ.100 లాక్కున్నారు మూడు రోజులుగా రెస్ట్ లేకుండా లారీ నడుపుతున్నా. అన్నం తినడానికి కూడా డబ్బు లేదు. ప్యాసింజర్లను ఎక్కించుకుంటే భారీగా ఫైన్ వేస్తున్నారు. నేను, క్లీనర్ టిఫిన్ చేయడానికి రూ.100 పెట్టుకున్నాం. గుత్తి టోల్ ప్లాజా వద్ద పోలీసులు లారీని ఆపి మా వద్దనున్న రూ.100 బలవంతంగా లాక్కున్నారు. – కర్ణాటక లారీ డ్రైవర్ -
హోలీ రోజున.. చలానాల పంట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకగా.. కొందరి అత్యుత్సాహం వల్ల పోలీసులకు చలాన్ల రూపంలో భారీ మొత్తం వసూలైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5624 మంది నుంచి 5.51 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు పోలీసులు చెప్పారు. 'హోలీ రోజున గురువారం ట్రాఫిక్ పోలీసులు 5624 మంది వాహనదారులకు చలానా వేశారు. మద్యం తాగి వాహనం నడపడం, బైకులపై ముగ్గురు వెళ్లడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం, హెల్మెట్లు ధరించకపోవడం, రాంగ్ రూట్లో వెళ్లడం వంటి కేసుల్లో చలానాలు వసూలు చేశాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చలానాల రూపంలో 5.51 లక్షల రూపాయలు వసూలైంది' అని ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ ముక్తేష్ చందర్ చెప్పారు. ఇక హోలీ రోజున ట్రాఫిక్ పోలీసులు 1085 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నగరంలో కనీసం 403 ట్రాఫిక్ పోలీసు బృందాలను మోహరించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలానాల రూపంలో 9.22 లక్షల రూపాయలు వసూలైనట్టు చెప్పారు. గతేడాది మొత్తం 64.53 కోట్ల రూపాయలను ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసినట్టు ముక్తేష్ చందర్ తెలిపారు.