
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహనాలను ఆపి తమ చేతిలో ఉన్న పుస్తకంలో రాసి చలాన్ జారీ చేయడం... అది కట్టించుకునే నెపంతో ‘చేతివాటం’ చూపించడం... కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు తావివ్వడం... ఇకపై ఇలాంటి సీన్లు రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు. ప్రస్తుతం రాజధానికి మాత్రమే పరిమితమైన నాన్ కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేపట్టిన పోలీసు విభాగం ఇప్పటికే 18 యూనిట్లలో (జిల్లా, కమిషనరేట్) దీనిని అమలులోకి తీసుకొచ్చింది. గరిష్టంగా వారం రోజుల్లో మిగిలిన తొమ్మిదింటిలోనూ అమలు చేయనున్నారు. ఈ క్రతువు పూర్తయితే పూర్తిస్థాయి నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది.
వివాదాలు, ఘర్షణలకు తావు లేకుండా...
ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాలు అమలులో ఉండేవి. ఇందులో భాగంగా చలాన్ పుస్తకాలు పట్టుకుని రంగంలోకి దిగే ట్రాఫిక్/శాంతిభద్రతల విభాగం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధించడంతో పాటు జరిమానా వసూలు చేసేవారు. దీనివల్ల వాహనచోదకులతో తరచు ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకునేవి. వీటికి తోడు పోలీసులు సైతం చేతివాటం ప్రదర్శించడంతో అవినీతికీ ఆస్కారం ఉండేది. 2014లో నగర పోలీసు కమిషనర్‌గా నియమితులైన ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఆయన చొరవతో 2015 జనవరి 20 నుంచి హైదరాబాద్‌లో ఇది అమలులోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులు అమలులోకి తీసుకువచ్చారు. 2016 నవంబర్ నుంచి రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్‌రెడ్డి నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. సన్నాహాలు తుదిదశకు చేరిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆ హడావుడి పూర్తి కావడంతో శరవేగంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
పీడీఏలతో పని లేకుండా...
నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంలో సాధారణంగా ఏ పోలీసు అధికారి రోడ్డుపై వాహనాలను ఆపరు. కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనులకు టికెట్ ద్వారా చలాన్ జారీ చేసినా డబ్బు మాత్రం కట్టించుకోరు. తమ దృష్టికి వచ్చిన ఉల్లం«ఘనలను ఫొటోలో బంధించి ఆయా జిల్లాలు, కమిషనరేట్ల లోని కంట్రోల్‌రూమ్స్‌కు అప్‌లోడ్ చేస్తారు. రహదారుల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారానూ కంట్రోల్ రూమ్ అధికారులు ఉల్లంఘనుల ఫొటోలు క్యాప్చర్ చేస్తారు. అక్కడి సిబ్బంది ఆ వాహనం నంబర్ ఆధారంగా ఆర్టీఏ కార్యాలయంలో నమోదైన చిరునామా ఆధారంగా వాహనచోదకుడికి ఈ–చలాన్ జారీ చేసి పోస్టులో పంపిస్తారు. ఈ మొత్తాన్ని ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, కొన్ని బ్యాంకులు, ఆన్‌లైన్‌తో పాటు నిర్దేశించిన మార్గాల్లో వాహనచోదకుడే స్వయంగా చెల్లించాలి. చిరునామా తప్పుగా ఉండటం, మారిపోవడం తదితర కారణాలతో ఈ–చలాన్ వాహనచోదకుడికి అందకపోతే... పెండింగ్‌లో ఉన్న వాటిని (www.echallan.org) వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు. పెండింగ్ చలాన్లు ఉన్న వారిని తనిఖీ చేయడానికి ఒకప్పుడు పీడీఏ మిషన్లు అవసరం ఉండేది. ఇవి పెండింగ్ డేటాబేస్‌తో అనుసంధానమై ఉండేవి. తాజాగా ఈ డేటాబేస్‌ను ‘టీఎస్ కాప్’ యాప్‌తో అనుసంధానించారు. ఫలితంగా పోలీసులు తమ స్మార్ట్‌ఫోన్ ట్యాబ్ ద్వారానే ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయడం, పెండింగ్‌వి తనిఖీ చేయడం సాధ్యమవుతోంది.
రాష్ట్రం మొత్తం ఒకే డేటాబేస్...
హైదరాబాద్‌లో అమలులో ఉన్న విధానాలు నేపథ్యంలో ఇక్కడ వాహనం జాగ్రత్తగా నడిపే వ్యక్తి వేరే జిల్లాకు వెళితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అక్కడ ఈ–చలాన్ విధానం లేకపోవడం, ఉన్నా ఆ వివరాలు అక్కడి పోలీసులకు తెలియకపోవడమే దీనికి కారణం. అయితే తాజాగా రాష్ట్ర పోలీసులు విభాగం రాష్ట స్థాయిలో ఒకే డేటాబేస్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 27 పోలీసు యూనిట్లూ అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడ ఉల్లంఘనకు పాల్పడినా చిక్కడం, జరిమానా చెల్లించడం తప్పనిసరిగా మారుతోంది. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కీలక కారకంగా ఉన్న మద్యం తాగి వాహనాలు నడపడాన్నీ నిరోధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు తప్పనిసరి చేయడంతో పాటు హైదరాబాద్‌లో అమలులో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను (ఎస్‌ఓపీ) అన్నింటిలోనూ అమలు చేయనున్నారు. వీటి ప్రకారం ఇకపై ఈ ఉల్లంఘనకు పాల్పడి చిక్కిన వారు కచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment