సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ– చలాన్ల ప్రధాన ఉద్దేశం రోడ్డు భద్రత పెంచడంతో పాటు ప్రమాదాలు, మరణాలు నిరోధించడం. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ జారీ విధానం ‘రోగమొక చోటైతే.. మందొక చోట’ అన్న చందంగా ఉంది. ఈ లోపాలను పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే ఎక్కువగా కన్నేసి ఉంచనున్నారు. అక్కడి ఉల్లంఘనులనే ఫొటోలు తీసి ఈ–చలాన్ల పంపనున్నారు. త్వరలో ఈ విధానం ప్రారంభం కానుందని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు.
90 శాతం హెల్మెట్ కేసులే..
లక్డీకాపూల్ అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ప్రాంతం. ఇక్కడ సరాసరిన వాహనాల సరాసరి వేగం గంటలకు 15 కి.మీ కూడా మించదు. అలాంటి చోట హెల్మెట్ ధరించినా, ధరించకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇలాంటి చోట్లా రోజూ వందలు, వేల సంఖ్యలో ‘వితౌట్ హెల్మెట్’ కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్లు జారీ చేస్తుంటారు.
►ఏటా జారీ అవుతున్న ఈ– చలాన్లలో 90 శాతం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. ప్రస్తుతం జారీ అవుతున్న ఈ– చలాన్ విధానంలో ఇలాంటి లోపాలు అనేకం ఉన్నాయి. వీటిని గమనించిన రంగనాథ్ కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో నాన్ కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానం అమలవుతోంది.
►దీని ప్రకారం ఏ ట్రాఫిక్ పోలీసు ఉల్లంఘనులకు నేరుగా చలాన్ విధించరు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న కెమెరాలతో ఉల్లంఘనకు పాల్పడిన వాహనం ఫొటో తీస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్‌లోని వాహనం చిరునామా ఆధారంగా ఉల్లంఘనకు సంబంధించిన ఈ– చలాన్ పంపిస్తున్నారు. ఈ ఫొటోలు తీసే పోలీసులు జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు.
బ్లాక్ స్పాట్లలోనే..
ఒకే చోట ఉంటూ తమ కంటికి కనిపించిన ప్రతి ఉల్లంఘనను ఫొటో తీస్తున్నారు. ఇకపై వీళ్లు తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్ స్పాట్స్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే గడిచిన అయిదేళ్ల గణాంకాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు పోలీసుస్టేషన్ల వారీగా ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పోలీసులు కూడా ఏ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఉల్లంఘనలకే ప్రాధాన్యం ఇస్తూ ఫొటోలు తీస్తారు.
చదవండి: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?
125 ఆధునిక ట్యాబ్‌ల కొనుగోలు..
►ఈ విధానం అమలు కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు కొత్తగా 125 అత్యాధునిక ట్యాబ్స్ ఖరీదు చేశారు. కెమెరాల స్థానంలో వీటిని వినియోగిస్తూ, ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనుల ఫొటోలు తీయనున్నారు. దీంతో ఆ ఫొటో తీసిన సమయం, తేదీలతో పాటు ప్రాంతం కూడా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నమోదవుతుంది. క్షేత్రస్థాయి పోలీసులు ఒకే చోట ఉండి ఫొటోలు తీయకుండా నిఘా ఉంచేందుకు ఇది ఉపకరించనుంది.
►మరోపక్క ప్రస్తుతం ఈ– చలాన్ల బట్వాడాకు సంబంధించి పోలీసు విభాగం పోస్టల్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లిస్తోంది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒక్కో ఈ– చలాన్‌కు రూ.15 చొప్పున పోస్టల్ శాఖకు చేరుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ– లోక్ అదాలత్‌లో వచ్చిన సొమ్ము నుంచి ఇది చెల్లించాల్సిందే. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment