హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ రంగనాథ్‌ బదిలీ.. | Hyderabad Traffic Chief AV Ranganath Tansferred As Warangal CP | Sakshi
Sakshi News home page

AV Ranganath IPS: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ రంగనాథ్‌ బదిలీ.. గ్రూప్‌–1 అధికారి నుంచి డీఐజీ వరకు

Published Thu, Dec 1 2022 9:10 AM | Last Updated on Thu, Dec 1 2022 2:35 PM

Hyderabad Traffic Chief AV Ranganath Tansferred As Warangal CP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/వరంగల్‌: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్‌ గతేడాది డిసెంబర్‌ 29న సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్‌ రోప్‌లో రంగనాథ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు, తప్పుడు నంబర్‌ ప్లేట్లతో  తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్‌పేట్‌ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం... ఇలా నగర ట్రాఫిక్‌పై రంగనాథ్‌ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ లోక్‌ అదాలత్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చేశారు.

ట్రాఫిక్‌ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్‌ లైట్‌ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్‌ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్‌ తీసుకువచ్చారు. ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్‌ విభాగానికి కొత్త చీఫ్‌ వచ్చే వరకు మరో అధికారి ఇన్‌చార్జిగా ఉండనున్నారు.  

19నెలలు పనిచేసిన తరుణ్‌జోషి
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ తరుణ్‌జోషిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.  2004 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన తరుణ్‌జోషి 2021 ఏప్రిల్‌ 4న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీస్‌ వర్టికల్స్, వెల్ఫేర్‌ విషయంలో నిజాయితీగల అధికారిగా పేరున్న ఆయన సుమారు 19 నెలల పాటు తన మార్కు వేసుకున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన తరుణ్‌జోషి సెంట్రల్‌ సర్వీసెస్‌కు వెళ్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇదే సమయంలో గురువారం ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ను నియమించింది. 
చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..

పోలీస్‌శాఖలో రంగనాథ్‌ తనదైన మార్క్‌ 
ఏవీ రంగనాథ్‌ 1970 అక్టోబర్‌లో నల్లగొండలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకు అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్‌ బాస్‌ కావాలన్న లక్ష్యంతో గ్రూప్‌–1 పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. గ్రూప్‌ –1 లో స్టేట్‌ 13వ ర్యాంకు సాధించారు. పోలీస్‌ బాస్‌ కావాలన్న ఏకైక లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్‌ ఖరారు చేసుకున్నారు.

1996 బ్యాచ్‌లో డీఎస్పీ ర్యాంక్‌లో స్థిరపడి 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్‌ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి, ఆ తర్వాత సంవత్సరంపాటు వరంగల్‌ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్‌ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్‌ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్‌ చర్చల  సందర్భంలో నక్సల్స్‌ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు.

అనంతరం తూర్పు గోదావరి అడిషనల్‌ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్‌ వద్ద నక్సల్స్‌ చేతిలో గ్రేహౌండ్స్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్‌ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్‌ ఆపరేషన్స్‌ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్‌.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్‌ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు.

నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌ సిటీలో జాయింట్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్‌ వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత ప్రణయ్‌ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు.  నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్‌ సమస్యపై కీలకంగా పనిచేశారు. కాగా, ఆయన సీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనరేట్‌ వర్గాలు తెలిపాయి.

ప్రొఫైల్‌
పూర్తి పేరు :  ఆవుల వెంకట రంగనాథ్‌
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 22, 1970
పుట్టిన ప్రదేశం : నల్లగొండ
తల్లిదండ్రులు :  సుబ్బయ్య, విజయలక్ష్మి 
భార్య : లక్ష్మీలావణ్య
పిల్లలు : రుషిత, కౌశిక్‌
గ్రూప్‌ –1 : 1996 డీఎస్పీ, 2006లో ఐపీఎస్‌
మొదటి పోస్టింగ్‌ : గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌
ఇష్టమైన ఆట : టెన్నిస్‌
ప్రదేశం : కశ్మీర్‌  


చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement