సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు రిబేటుతో చెల్లించడానికి అవకాశం కల్పించిన ఈ– లోక్ అదాలత్ శుక్రవారంతో ముగిసింది. మార్చి 1న మొదలైన ఈ పథకం తొలుత ప్రకటించిన దాని ప్రకారం అదే నెల 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో 15 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ– చలాన్ల బకాయిలు రూ.1,200 కోట్ల ఉండగా.. 90 నుంచి 25 శాతం వరకు రిబేట్స్ ఇవ్వడంతో ఈ– లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.250 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రూ.300 కోట్లకు చేరడంతో విజయవంతమైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 11.59 గంటల వరకు సమయం ఉండటంతో మరికొంత జమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.92 కోట్ల వాహనచోదకులు వినియోగించుకున్నారు.
అత్యధికంగా ద్విచక్ర వాహనాలవే..
చెల్లింపులు జరిగిన అత్యధిక చలాన్లు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే అని అధికారులు వివరిస్తున్నారు. మొత్తం పెండింగ్ చలాన్లలో 70 శాతానికి పైగా క్లియర్ అయినట్లు స్పష్టం చేస్తున్నారు. కొన్ని వాహనాలు చేతులు మారడం, మరికొన్ని వినియోగంలో లేకపోవడం తదితర కారణాలతో 10 నుంచి 15 శాతం చలాన్లు చెల్లింపులు జరగలేదని భావిస్తున్నారు.
ఈ– లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై సోమవారం నుంచి చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సర్వర్‌లో పెండింగ్ చలాన్లు జాబితాను అప్‌డేట్ చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయి అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లకు అనుసంధానించి ఉంటుంది.
రహదారులపై తనిఖీలు నిర్వహించనున్న ప్రత్యేక బృందాలు జరిమానాల బకాయి ఉన్న వారిని గుర్తించి పట్టుకుంటాయి. వీళ్లు ఎంత మొత్తం పెండింగ్‌లో ఉండే అంతా చెల్లించేలా చర్యలు తీసుకోనున్నాయి. మరోపక్క 15 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారి జాబితాలను ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా రూపొందిస్తున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు
చేయనున్నారు.
వీటిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చలాన్ల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా టాప్ వైలేటర్స్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్ నుంచి ఆయా వాహన చోదకుల చిరునామాలు సంగ్రహిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఏర్పాటయ్యే ప్రత్యేక బృందాలకు ఇవి అందించనున్నారు. ఆ టీమ్స్ సదరు ఉల్లంఘనుల ఇళ్లకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న జరిమానా చెల్లించేలా ప్రయత్నాలు చేస్తాయి.
ఫోన్ నంబర్ల డేటాబేస్ సమకూరింది
ఈ– లోక్ అదాలత్ నేపథ్యంలో భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు వసూలు కావడంతో పాటు వాహన చోదకులకు సంబంధించిన ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ సమకూరింది. కొన్ని వాహనాలు అనేక మంది చేతులు మారినా... ఆర్టీఏ డేటాబేస్‌లో అప్‌డేట్ కాని నేపథ్యంలో వారి చిరునామాలు, కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉండేవి కాదు. ఫలితంగా అనేక ఈ– చలాన్లు వాహనాల మాజీ యజమానులకు చేరేవి.
ఈ– లోక్ అదాలత్ చెల్లింపుల నేపథ్యంలో ఓటీపీ తప్పనిసరి చేయడంతో వాహనచోదకులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు తమ ఫోన్ నంబర్లను పొందుపరిచారు. ఈ వివరాలు సంగ్రహించిన సర్వర్ ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఈ– చలాన్‌ను వాట్సాప్ ద్వారా పంపే ప్రక్రియ కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. ఇలా చేస్తే ప్రతి ఉల్లంఘనుడికి కచ్చితంగా ఈ– చలాన్ చేరుతుంది.
– నగర ట్రాఫిక్ ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment