Hyderabad Wrong Challan: Hyd Traffic Police Troubling Citizens With Wrong E Challans - Sakshi
Sakshi News home page

E Challan: హైదరాబాదీలకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

Published Mon, Oct 4 2021 8:51 AM | Last Updated on Mon, Oct 4 2021 3:45 PM

Hyderabad Traffic Police Troubling Citizens With Wrong E Challans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు’ న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రమిది. అయితే ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లంఘనులకు చలాన్లు పడటమేమో కానీ.. ఇష్టారాజ్యంగా పంపిస్తున్న ఈ–చలాన్ల కారణంగా సాధారణ వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా వచి్చన తప్పుడు చలాన్‌ తీయించుకోవాలంటూ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు, ప్రధాన కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిగరాల్సి వస్తోంది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండట్లేదని వాహనచోదకులు వాపోతున్నారు. 

నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంటే కారణం... 
ప్రస్తుతం ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనులకు జరిమానా విధించడం మొత్తం నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానంలో సాగుతోంది. ఒకప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు చౌరస్తాలతో పాటు ప్రధాన రహదారులపై ఉండి ఉల్లంఘనులను పట్టుకునే వారు. వారికి చలాన్‌ విధించి అప్పటికప్పుడే వారి నుంచి జరిమానా మొత్తాన్ని వసూలు చేసే వారు. కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా పిలిచే ఈ విధానంలో వాహనచోదకులతో ఘర్షణలకు, అవినీతికి ఆస్కారం ఉంటోందని ట్రాఫిక్‌ అధికారులు భావించారు. దీంతో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఈ విధానంలో రహదారులపై ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనుల ఫొటోలు తీస్తారు. ఇవి పోలీసుస్టేషన్‌ నుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి.  సిబ్బంది వాహనం నంబర్‌ ఆధారంగా ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాకు ఈ–చలాన్‌ పంపుతారు.  
చదవండి: హైదరాబాద్‌: ఒక బైక్‌పై 88 చలాన్లు.. కంగుతిన్న పోలీసులు


ఈ ఏడాది జూన్‌ 16న టీఎస్‌07ఈకే4800 నంబర్‌ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు రాంగ్‌ పార్కింగ్‌ ఇన్‌ క్యారేజ్‌ వే అంటూ ఈ–చలాన్‌ విధించారు. మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌  లిమిట్స్‌లో ఉదయం 11.33 గంటలకు, సాయంత్రం 4.08 గంటలకు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు చలాన్లు విధిస్తూ ఎవిడెన్స్‌గా రెండు ఫొటోలు పొందుపరిచారు. అయితే ఆ రెండూ ఒకే సందర్భంలో తీసినవి కావడం గమనార్హం. దీనికితోడు సాయంత్రం 4 గంటల సమయంలో సదరు వాహనచోదకుడు బంజారాహిల్స్‌లో తాను విధులు నిర్వర్తించే కార్యాలయంలో ఉండటం కొసమెరుపు.  

కనిపించక... కన్‌ఫ్యూజన్‌తో... 
ఇలా పోస్టు ద్వారా, ఎస్సెమ్మెస్‌ రూపంలో ఈ–చలాన్‌ అందుకునే ఉల్లంఘనుడు వానిటి చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో జరిగే పొరపాట్ల వల్లే ఈ తప్పుడు చలాన్లు విధింపు జరుగుతోందని తెలుస్తోంది. అక్కడ ఉండే సిబ్బందికి ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ నుంచి వచ్చిన ఫొటోలోని వాహనం నంబర్‌ కొన్ని సందర్భాల్లో సరిగ్గా కనిపించట్లేదు. దీంతో వాళ్లే ఓ వాహనం నంబర్‌ ఊహించుకుని ఆ ఈ–చలాన్‌ విధించేస్తున్నారు. ఒక్కోసారి వచ్చిన ఫొటోనే మరోసారి వస్తోంది. దీన్ని పరిశీలించని సిబ్బంది రెండోసారీ చలాన్‌ వేసేస్తున్నారు. పోలీసుస్టేషన్ల పరిధులు, అవి ఉండే ప్రాంతాలపై అవగాహన లేని సిబ్బందో, కొత్తవారో ఈ ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తుంటే తప్పుడు చలాన్లు వెళ్తున్నాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానూ ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి.  
చదవండి: ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌

కాళ్లరిగేలా తిరగాల్సిందే... 
ఇలాంటి పొరపాట్లకు తావుంటుందని అనుమానించిన ఉన్నతాధికారులు ఈ–చలాన్‌లు కనిపించే అధికారిక వెబ్‌సైట్‌లోనే ‘రిపోర్ట్‌ అజ్‌’ను చేర్చారు. ఎవరికైనా ఇలాంటి తప్పుడు, పొరపాటు చలాన్లు వస్తే దాని ద్వారానే ట్రాఫిక్‌ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇలా ఫిర్యాదు చేసినప్పటికీ ట్రాఫిక్‌ విభాగం నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. నెలల తరబడి వేచి చూసినా ఫలితం శూన్యమని, ఈ లోపు రహదారిపై ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేస్తే పెండింగ్‌ చలాన్లు ఉన్నాయంటూ కట్టమంటున్నారని వాహనచోదకులు వాపోతున్నారు.

ఈ తప్పుడు చలాన్లపై ఫిర్యాదు చేయడానికి స్థానిక ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లకు వెళ్లే ప్రధాన కార్యాలయానికి వెళ్లమని చెప్తున్నారని.. అక్కడకు వెళ్తే ఠాణాకు వెళ్లి సరిచూసుకోవాలని సూచిస్తూ కాళ్లరిగేలా తిప్పుతున్నారని బాధితులు వాపోతున్నారు.  ఎంత మొత్తుకున్నా వారికి నిరాశే మిగులుతోంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. 

ఠాణా పరిధినే మార్చేశారు
ఈ ఏడాది ఆగస్టు 24న టీఎస్‌11ఈబీ9776 నంబర్‌ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు రూ.1000 ఈ–చలాన్‌ విధించారు. ఖిల్వత్‌ సమీపంలోని రాజేష్‌ మెడికల్‌ హాల్‌ వద్ద తీసిన ఫొటో పొందుపరుస్తూ వాహనచోదకుడు హెల్మెట్‌ ధరించని కారణంగా చలాన్‌ వేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే సౌత్‌జోన్‌ పరిధిలోని పాతబస్తీలో ఉన్న రాజేష్‌ మెడికల్‌ హాల్‌ను ట్రాఫిక్‌ పోలీసులు నార్త్‌జోన్‌లోని గోపాలపురం ఠాణాకు లిమిట్స్‌కు ‘మార్చేశారు’. అంతే కాదు... ఎవిడెన్స్‌గా ట్రాఫిక్‌ పోలీసులు పొందుపరిచిన ఫొటోలో వెనుక కూర్చున్న వాళ్లు హెల్మెట్‌ ధరించలేదు. దీనికి పిలియన్‌ రైడర్‌ హెల్మెట్‌ ధరించలేదని చలాన్‌ విధించాల్సి ఉంది. 

ఈ ఏడాది మార్చ్‌ 9న టీఎస్‌10 ఈకే6850 నంబర్‌ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు సిగ్నల్‌ జంపింగ్‌ అంటూ రూ.1000 ఈ–చలాన్‌ విధించారు. తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని హోలీ ఫ్యామిలీ చౌరస్తా వద్ద ఈ ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంటూ ఓ ఫొటోను ఎవిడెన్స్‌గా పొందుపరిచారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి తాను వెళ్లలేదంటూ వాహనచోదకురాలు స్పష్టం చేస్తున్నారు.  ఈ ఫొటోను ఎంత పరికించి చూసినా, ఏ స్థాయిలో పరిశీలించినా వాహనం నంబర్‌ కనిపించకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement