సైదాబాద్: ట్రాఫిక్ పోలీసుల ‘చలాన్ల’ వేధింపులు ఒక హమాలీ ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కూలిపని చేసుకునే తాను చలాన్లు కట్టలేనని చెప్పినా ట్రాఫిక్ ఎస్‌ఐ కనికరించలేదని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు తన బాధను వ్యక్తం చేస్తూ మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరడిగొమ్మ గ్రామానికి చెందిన ఎ.ఎల్లయ్య (45) నగరానికి వలస వచ్చి ఐఎస్‌సదన్ డివిజన్ చింతల్‌బస్తీలో నివసిస్తున్నాడు.
అతని భార్య సైదాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. హమాలీ పనిచేసే ఎల్లయ్య ద్విచక్రవాహనంపై మూడు చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదివారం రాత్రి భారత్‌గార్డెన్ వద్ద విధులు నిర్వహిస్తున్న మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు అతని వాహనాన్ని తనిఖీ చేసి పెండింగ్ చలాన్‌లు ఉన్నాయని వాహనాన్ని సీజ్ చేశారు. అతను వాహనాన్ని విడిచి పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చలాన్‌లు చెల్లించాలని పోలీసులు తెలిపారు.
చలాన్‌లు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో మనస్థాపం చెందిన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సైదాబాద్ పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే మృతుడు రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లకు తెలుపుతూ తన బాధ వ్యక్తం చేశాడు. ‘మీర్‌చౌక్ పోలీసులు రూ.పది వేలు కడితేనే నా బండి ఇస్తామంటున్నారు. కూలిపని చేసుకునే వాడినని బతిమాలినా వారు ఒప్పుకోవడం లేదు.’ అని ఎల్లయ్య సూసైడ్‌నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నాని అందులో పేర్కొన్నాడు. కాగా సైదాబాద్ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment