ఉల్లంఘనలకు కేరాఫ్‌గా ‘రెంటల్‌’ బైక్స్‌ | Rental Bikes Breaks Traffic Rules in Hyderabad | Sakshi
Sakshi News home page

అద్దె బైక్‌..‘క్రాసింగ్‌’ కిక్‌!

Published Sat, Mar 14 2020 7:55 AM | Last Updated on Sat, Mar 14 2020 9:13 AM

Rental Bikes Breaks Traffic Rules in Hyderabad - Sakshi

నగరంలో ‘రెంటల్‌ బైక్స్‌’ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ వాహనాలపై షికార్లు కొడుతున్నారు. భారీగా ఉల్లంఘనలకూ పాల్పడుతున్నారు. యాప్‌ల ద్వారా బుకింగ్‌ చేయడం...బైకు వారి సొంతం కాకపోవడం...పోలీసుల భయం లేకపోవడం..జరిమానా కట్టే బాధ ఉండకపోవడంతో అద్దె బైకులపై మైనర్లూ హల్‌చల్‌ చేస్తున్నారు. ఇష్టంవచ్చినట్లు డ్రైవ్‌ చేస్తూ..దూసుకుపోతూ ఇతర వాహనచోదకులకు నరకం చూపిస్తున్నారు. మరోవైపు హల్‌చల్‌ రైడర్ల కారణంగా ఆయా రెంటల్‌ సంస్థలు నెలకు రూ.లక్షల్లో జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఇక ఈ వాహనాలు భద్రతా పరంగానూ సంక్షిష్టతను సృష్టించేఅవకాశం ఉందని నిపుణులువ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఒకచోట నుంచి మరోచోటుకు ప్రయాణించడానికి ఆటో, బస్సు, ట్యాక్సీ, ఎంఎంటీఎస్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వీటికి తోడు రెంటల్‌ బైక్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఎంత ఉపయోగం ఉంటోందో.. దానికి రెట్టింపు స్థాయిలో ఇబ్బందులు ఉంటున్నాయని ట్రాఫిక్‌ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కోకొల్లలుగా ఉల్లంఘనలకు పాల్పడటం ఒక ఎత్తయితే.. భద్రత పరంగానూ ఎన్నో సవాళ్ళు సృష్టించే ఆస్కారం ఉండటం మరో ఎత్తని వ్యాఖ్యానిస్తున్నారు. 

అంతా యాప్‌ ఆధారంగానే...
సిటీలో కొన్ని సంస్థలకు చెందిన రెంటల్‌ బైక్స్‌ వేల సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటిని బుక్‌ చేసుకోవడం, వినియోగించడం అంతా స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వాటి యాప్స్, బ్లూటూత్‌ పరిజ్ఞానం ఆధారంగా జరుగుతోంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు, దాని ఫొటోతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ఫీనీ యాప్‌లోకి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సరి చూసిన తర్వాతే ఆ యాప్‌ నిర్వాహకులు వాహనం బుక్‌ చేసుకోవడానికి, వినియోగించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ వాహనాలను వినియోగించే వాహనచోదకుల సౌకర్యార్థం వాటి సీటు కింద డిక్కీల్లో హెల్మెట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. బుకింగ్‌ను అంగీకరించే ముందే ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, హెల్మెట్‌ వాడాలని, అధికారిక పార్కింగ్‌ ప్రాంతాల్లోనే వాహనాన్ని పార్క్‌ చేయాలని సూచిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాక్టికల్‌గానే ఇబ్బందులు వస్తున్నాయి.

ఆ మొబైల్‌ చేతిలో ఉండే చాలు...
మోటారు వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనం ఇవ్వడం, వాళ్ళు దాన్ని నడపటం నేరం. ఇలా చేస్తూ ఎవరైనా చిక్కితే ఆ మైనర్‌తో పాటు వాహన యజమానీ బాధ్యుడవుతాడు. ఇతడిని జువైనల్‌హోమ్‌కు అతడికి జైలుకు తరలించేందుకు ఆస్కారం ఉంది. గతంలో ఇలాంటి కేసులు నగరంలో వెలుగు చూశాయి. అయితే రెంటల్‌ బైక్స్‌ విషయానికి వచ్చేసరికి మైనర్లు వీటిని వాడకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. అప్పటికే ఆయా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, రెంటల్‌ బైక్స్‌ వినియోగిస్తూ వారి మొబైల్‌ చేతిలో ఉండే చాలు... మైనర్లు సైతం ఈ బైక్స్‌ బుక్‌ చేసుకుని చక్కర్లు కొట్టేయచ్చు. ఓ వాహనాన్ని బుక్‌ చేసుకుంటున్న సమయంలో సదరు వినియోగదారులు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఫోన్‌ యజమానేనా? వేరే వ్యక్తా? మైనరా? అనేది తెలుసుకునే పరిజ్ఞానం ఆయా సంస్థల వద్ద  ఉండట్లేదు. ఈ విషయంలో మైనర్‌కు వాహనం ఇచ్చిన సంస్థది తప్పవుతుందా? లేక సదరు మైనర్‌ యాత్‌తో కూడిన మొబైల్‌ ఇచ్చిన వ్యక్తిది తప్పవుతుందా? అనేది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 

ఎడాపెడా దూసుకుపోతూ ఫీట్లు...  
ఈ కారణంగానే అనేక మంది మైనర్లు సైతం ఈ రెంటల్‌ బైక్స్‌పై ఎడాపెడా దూసుకుపోతున్నారు. వీటిని వినియోగిస్తున్న మేజర్లు సైతం చేస్తున్న ఫీట్లు అన్నీఇన్నీ కావు. నెక్లెస్‌రోడ్, కేబీఆర్‌ పార్క్‌ తదితర మార్గాల్లో ఈ రెంటల్‌ బైక్స్‌ రైడర్లు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ రెంటల్‌ బైక్‌ డిక్కీలో హెల్మెట్‌ ఉండాల్సి ఉన్నా.. అనేక వాటిలో మాయమయ్యాయి. దీంతో వీటిని బుక్‌ చేసుకున్న వినియోగదారులు హెల్మెట్లు లేకుండానే దూసుకుపోతున్నారు. దీనికి తోడు సొంత వాహనం కాకపోవడంతో అడ్డదిడ్డంగా డ్రైవ్‌ చేయడం, త్రిబుల్‌ రైడింగ్, అక్రమ పార్కింగ్, రద్దీ రోడ్లలోనూ వీటిని వదిలేయడం తదితర ఉల్లంఘ«నలకు ఈ వాహనాలు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారుతున్నాయి. రహదారుల్లో వీరు చేస్తున్న విన్యాసాల కారణంగా తమ పనులపై వెళ్ళే సాధారణ వాహనచోదకులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. వీరి వ్యవహారంపై ఫిర్యాదు చేయాలన్నా ఎవరి చెప్పాలో అర్థం కాక మిన్నకుండిపోతున్నారు. 

నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కావడంతో...
ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాలు అమలు చేస్తున్నారు. వీటి ప్రకారం సాధారణంగా రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌లు వాహనచోదకుల్ని ఆపి చలాన్లు విధించరు. కేవలం పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనచోదకుల్ని గుర్తించడానికి, డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలకు మాత్రమే వాహనాలను ఆపుతున్నారు. మిగిలిన సందర్భాల్లో కేవలం ఉల్లంఘనుల ఫొటో తీసి ఈ–చలాన్‌ మాత్రమే పంపిస్తున్నారు. ఈ కారణంగానే రెంటల్‌ బైక్స్‌పై ఫీట్లు చేస్తున్న, ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు ఆపట్లేదు. కేవలం ఆయా ఉల్లంఘనల్ని ఫొటోలు తీసి ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామా ఆధారంగా సదరు బైక్స్‌ను నిర్వహిస్తున్న సంస్థలకు పంపిస్తున్నారు. ఆ నిర్వాహకులు జరిమానాలు రూ.లక్షల్లో చెల్లిస్తున్నా బైక్స్‌ వినియోగిస్తున్న ఉల్లంఘనులకు మాత్రం చెక్‌ పడట్లేదు. ఈ బైక్‌ యాప్స్‌తో కూడిన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతిలో పడి, వాళ్ళు ఆ వాహనాలు బుక్‌ చేసుకుని వినియోగించగలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. 

నిబంధనల ప్రకారం ‘విధిస్తున్నాం’
ఇటీవల కాలంలో నగరంలో పెరిగిపోయిన రెంటల్‌ బైక్స్‌ కారణంగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వీటిని వినియోగిస్తున్న యువకులు, మైనర్లు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీసీ కెమెరాల్లో అనునిత్యం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి నిబంధనల ప్రకారం ఈ–చలాన్లు విధిస్తున్నాం. ఇటీవలే ఓ సంస్థకు చెందిన ప్రతినిధులు నేరుగా వచ్చి రూ.3 లక్షల జరిమానాలు క్లియర్‌ చేసి వెళ్ళారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల దృష్టికి తీవ్రమైన ఉల్లంఘనలు వస్తే వెంటనేవాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆయా సంస్థలకుసమాచారం ఇచ్చి అప్పగిస్తున్నారు. ఈ కేసుల్లోనూ జరిమానా విధిస్తున్నారు. ఈ రెంటల్‌ బైక్స్‌వినియోగిస్తున్న ఆయతాయిల కారణంగాసాధారణ వాహనచోదకులు ఇబ్బందులుఎదుర్కొవాల్సి వస్తోంది.  – సిటీ ట్రాఫిక్‌ పోలీసులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement