Rental bikes
-
గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..!
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆదరణ లభిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు చెక్‌పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వాడకంలో తెచ్చేందుకుగాను భారతీయ రైల్వేస్ కూడా సరికొత్తగా ప్రయాణికులకు ఈ-బైక్ రెంటల్ బైక్ సర్వీసులను ప్రారంభించింది. గంటకు రూ. 50 చెల్లిస్తే ఈ బైక్ సర్వీసులను పొందవచ్చును. ఈ-బైక్ రెంటల్ సర్వీస్ ఎక్కడంటే..! తమిళనాడులోని తిరుచ్చి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ బైక్ (ఈ-బైక్) రెంటల్ సేవలను దక్షిణ రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ బైక్ సర్వీసులపై భారీ స్పందన వస్తోంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ-బైక్ రెంటల్ సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ-బైక్ సేవలను పొందాలంటే ముందుగా రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత గంటకు రూ.50 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.వాటితోపాటుగా ఆయా వ్యక్తి తన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ పత్రాలు ఇస్తే ఈ బైక్ సేవలను పొందవచ్చును. తిరుచ్చి రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ఈ-బైక్ రెంటల్ సర్వీసులపై భారీ ఆదరణ వస్తోనట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ-బైక్స్ రెంటల్ సేవలను వాడుకోవచ్చునని తిరుచ్చి రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చును. చదవండి: ఐఫోన్, ఐప్యాడ్, ఇప్పుడు ఐకార్..యాపిల్ నుంచి ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే.. -
హైదరాబాద్‌లో రెంటల్ బైక్స్‌పై కరోనా ప్రభావం
-
బైక్ ట్యాక్సీలతో బెంబేలే!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు రెంటల్ బైక్స్ ఓ రకంగా నరకం చూపిస్తుంటే... బైక్ ట్యాక్సీలు మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నగరంలోని అనేక మంది ఈ బైక్ ట్యాక్సీల వినియోగదారులకు కొన్ని అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటున్నాయి. వీటినిపట్టించుకునే నాథుడు లేకపోవడంతో పాటుఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు, మనకెందుకులే అనే భావనతో మరికొందరువదిలేస్తున్నారు. ఈ తరహాఉల్లంఘనలు, నిర్లక్ష్యాలు కొన్ని సందర్భాల్లో భద్రతపై నీలినీడలు వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా మూడు సంస్థలు ఈ బైక్ ట్యాక్సీ సర్వీసుల్ని అందిస్తున్నాయి. చిన్నాచితకా మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ స్మార్ట్ఫోన్లలో యాప్‌ల ఆధారంగా పని చేసే సంస్థలే. ప్రత్యేక అనుమతి లేకుండానే... రాజధానిలో ఆటోలు నడపాలన్నా, ట్సాక్సీలు డ్రైవ్ చేయాలన్నా ఆ డ్రైవర్లకు ప్రత్యేక అనుమతులు కావాలి. ఈ వాహనాలకు ఎల్లో నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలు కావడంతో డ్రైవర్ల అనునిత్యం ప్రయాణికుల్ని రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీరికి ప్రథమ చికిత్స నిర్వహణపై అవగాహన అవసరం. దీనికి సంబంధించిన శిక్షణ ఇచ్చిన తర్వాతే ఈ వాహనాల డ్రైవర్లకు ఆర్టీఏ విభాగం బ్యాడ్జ్ నెంబర్ ఇస్తుంది. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఈ నెంబర్ కూడా ఉంటేనే వాళ్లు ఆయా వాహనాలు నడపడానికి, ప్రయాణికుల్ని తీసుకుపోవడానికి అర్హులు. అయితే బైక్ ట్యాక్సీల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవీ అమలులో లేవు. వైట్ నెంబర్ ప్లేట్లతోనే, సాధారణ డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వాళ్లే ఆయా సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకుని బైక్ ట్యాక్సీలు నడిపేస్తున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సైతం ఏది బైక్ ట్యాక్సీనో, ఏది సొంత బైకో అర్థం కాని పరిస్థితి. రెండో హెల్మెట్ అత్యంత అరుదే... దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించే డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. ఈ నిబంధనను ఇప్పుడిప్పుడే రాజధానిలోని మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే బైక్ ట్యాక్సీని నడిపే డ్రైవర్ కచ్చితంగా తన వద్ద రెండు హెల్మెట్లు కలిగి ఉండాలి. ఒకటి తాను ధరించినా రెండోది తనను బుక్ చేసుకున్న ప్రయాణికుడికి అందించాలి. కమర్షియల్ వాహనం కావడంతో ఈ బాధ్యత డ్రైవర్ పైనే ఉంటుంది. అయితే నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్ కమ్ ఓనర్ల వద్ద ఒక హెల్మెట్ మాత్రమే కనిపిస్తుంటుంది. తన కస్టమర్‌కు కూడా అందించడానికి రెండో హెల్మెట్ కలిగి ఉండటం అనేది అత్యంత అరుదైన సందర్భంలోనే కనిపిస్తోంది. రెండు హెల్మెట్లు కలిగి ఉండాలంటూ ఈ డ్రైవర్లకు రిజిస్ట్రేషన్ చేసే సంస్థలు చెప్తున్నా అమలు చేస్తున్న వారు మాత్రం ఐదు శాతం కూడా ఉండట్లేదు. కొన్ని సంస్థలు అందించినవి సైతం తక్కువ సమయంలోనే ‘మాయం’ అవుతున్నాయి. పని వేళల అమలులో ఆమడ దూరం... ఆ కేటగిరీలో రిజిస్టర్ చేస్తున్నా, లేకున్నా కిరాయికి సంచరించే బైక్‌లు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే బైక్ ట్యాక్సీ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇది కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనలకు, ప్రమాదాలకు కారణం అవుతోంది. ఫలితంగా ఇతర వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పేరొకరిది... వచ్చేది ఇంకొకరు... బైక్ ట్యాక్సీల నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ను పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్ సైతం అందులో కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో బైక్ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉంటే... డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. ఇలా ‘మార్పిడి’ చేసుకుంటున్న వారిలో కుటుంబీకులే ఉంటే ఫర్వాలేదు కాని కొన్ని సందర్భాల్లో బయటి వారూ ఉంటున్నారు. వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారు, గతంలో అనివార్య కారణాలతో నిర్వాహకులు ‘బ్లాక్’ చేసిన డ్రైవర్లు ఈ మార్గం అనుసరిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. పార్ట్‌టైమర్లతో ఇబ్బంది లేదు నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్లలో రెండు రకాలైన వాళ్లు ఉంటున్నారు. దీన్నే వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న వాళ్లు మొదటి రకమైతే... పార్ట్‌టైమ్‌గా పని చేస్తున్న వాళ్లు ఇంకో రకం. రెండో కేటగిరీకి చెందిన వారిలో స్టూడెంట్లు, ఉద్యోగులు ఉంటున్నారు. వీరు తమ విధులకు వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు యాత్రమే ఈ యాప్స్‌ను ఆన్ చేసుకుని, ఆయా మార్గాల్లో ప్రయాణించే వారిని మాత్రమే తరలిస్తుంటారు. వీరి వల్ల పెద్దగా ఇబ్బందులు రావట్లేదు. మొదటి కేటగిరీకి చెందిన వారే ఎక్కువ ట్రిప్పులు వేస్తే అధిక మొత్తం సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో, నిర్వాహకులు అందించే ఇన్సెంటివ్స్ కోసం టార్గెట్స్ పూర్తి చేయడానికో ఎడాపెడా నడిపేస్తూ ఇబ్బందులు కలిగించడంతో పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ బైక్ ట్యాక్సీలకు అనుమతులు ఇచ్చేది ఆర్టీఏ విభాగమే.– ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారి -
ఉల్లంఘనలకు కేరాఫ్‌గా ‘రెంటల్’ బైక్స్
నగరంలో ‘రెంటల్ బైక్స్’ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ వాహనాలపై షికార్లు కొడుతున్నారు. భారీగా ఉల్లంఘనలకూ పాల్పడుతున్నారు. యాప్‌ల ద్వారా బుకింగ్ చేయడం...బైకు వారి సొంతం కాకపోవడం...పోలీసుల భయం లేకపోవడం..జరిమానా కట్టే బాధ ఉండకపోవడంతో అద్దె బైకులపై మైనర్లూ హల్చల్ చేస్తున్నారు. ఇష్టంవచ్చినట్లు డ్రైవ్ చేస్తూ..దూసుకుపోతూ ఇతర వాహనచోదకులకు నరకం చూపిస్తున్నారు. మరోవైపు హల్చల్ రైడర్ల కారణంగా ఆయా రెంటల్ సంస్థలు నెలకు రూ.లక్షల్లో జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఇక ఈ వాహనాలు భద్రతా పరంగానూ సంక్షిష్టతను సృష్టించేఅవకాశం ఉందని నిపుణులువ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఒకచోట నుంచి మరోచోటుకు ప్రయాణించడానికి ఆటో, బస్సు, ట్యాక్సీ, ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వీటికి తోడు రెంటల్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఎంత ఉపయోగం ఉంటోందో.. దానికి రెట్టింపు స్థాయిలో ఇబ్బందులు ఉంటున్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కోకొల్లలుగా ఉల్లంఘనలకు పాల్పడటం ఒక ఎత్తయితే.. భద్రత పరంగానూ ఎన్నో సవాళ్ళు సృష్టించే ఆస్కారం ఉండటం మరో ఎత్తని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా యాప్ ఆధారంగానే... సిటీలో కొన్ని సంస్థలకు చెందిన రెంటల్ బైక్స్ వేల సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటిని బుక్ చేసుకోవడం, వినియోగించడం అంతా స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకునే వాటి యాప్స్, బ్లూటూత్ పరిజ్ఞానం ఆధారంగా జరుగుతోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, దాని ఫొటోతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ఫీనీ యాప్‌లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సరి చూసిన తర్వాతే ఆ యాప్ నిర్వాహకులు వాహనం బుక్ చేసుకోవడానికి, వినియోగించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ వాహనాలను వినియోగించే వాహనచోదకుల సౌకర్యార్థం వాటి సీటు కింద డిక్కీల్లో హెల్మెట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. బుకింగ్‌ను అంగీకరించే ముందే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ వాడాలని, అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాన్ని పార్క్ చేయాలని సూచిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాక్టికల్‌గానే ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మొబైల్ చేతిలో ఉండే చాలు... మోటారు వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనం ఇవ్వడం, వాళ్ళు దాన్ని నడపటం నేరం. ఇలా చేస్తూ ఎవరైనా చిక్కితే ఆ మైనర్‌తో పాటు వాహన యజమానీ బాధ్యుడవుతాడు. ఇతడిని జువైనల్‌హోమ్‌కు అతడికి జైలుకు తరలించేందుకు ఆస్కారం ఉంది. గతంలో ఇలాంటి కేసులు నగరంలో వెలుగు చూశాయి. అయితే రెంటల్ బైక్స్ విషయానికి వచ్చేసరికి మైనర్లు వీటిని వాడకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. అప్పటికే ఆయా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని, రెంటల్ బైక్స్ వినియోగిస్తూ వారి మొబైల్ చేతిలో ఉండే చాలు... మైనర్లు సైతం ఈ బైక్స్ బుక్ చేసుకుని చక్కర్లు కొట్టేయచ్చు. ఓ వాహనాన్ని బుక్ చేసుకుంటున్న సమయంలో సదరు వినియోగదారులు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ యజమానేనా? వేరే వ్యక్తా? మైనరా? అనేది తెలుసుకునే పరిజ్ఞానం ఆయా సంస్థల వద్ద ఉండట్లేదు. ఈ విషయంలో మైనర్‌కు వాహనం ఇచ్చిన సంస్థది తప్పవుతుందా? లేక సదరు మైనర్ యాత్తో కూడిన మొబైల్ ఇచ్చిన వ్యక్తిది తప్పవుతుందా? అనేది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎడాపెడా దూసుకుపోతూ ఫీట్లు... ఈ కారణంగానే అనేక మంది మైనర్లు సైతం ఈ రెంటల్ బైక్స్‌పై ఎడాపెడా దూసుకుపోతున్నారు. వీటిని వినియోగిస్తున్న మేజర్లు సైతం చేస్తున్న ఫీట్లు అన్నీఇన్నీ కావు. నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్ తదితర మార్గాల్లో ఈ రెంటల్ బైక్స్ రైడర్లు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ రెంటల్ బైక్ డిక్కీలో హెల్మెట్ ఉండాల్సి ఉన్నా.. అనేక వాటిలో మాయమయ్యాయి. దీంతో వీటిని బుక్ చేసుకున్న వినియోగదారులు హెల్మెట్లు లేకుండానే దూసుకుపోతున్నారు. దీనికి తోడు సొంత వాహనం కాకపోవడంతో అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, అక్రమ పార్కింగ్, రద్దీ రోడ్లలోనూ వీటిని వదిలేయడం తదితర ఉల్లంఘ«నలకు ఈ వాహనాలు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్నాయి. రహదారుల్లో వీరు చేస్తున్న విన్యాసాల కారణంగా తమ పనులపై వెళ్ళే సాధారణ వాహనచోదకులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. వీరి వ్యవహారంపై ఫిర్యాదు చేయాలన్నా ఎవరి చెప్పాలో అర్థం కాక మిన్నకుండిపోతున్నారు. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కావడంతో... ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలు చేస్తున్నారు. వీటి ప్రకారం సాధారణంగా రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌లు వాహనచోదకుల్ని ఆపి చలాన్లు విధించరు. కేవలం పెండింగ్ చలాన్లు ఉన్న వాహనచోదకుల్ని గుర్తించడానికి, డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలకు మాత్రమే వాహనాలను ఆపుతున్నారు. మిగిలిన సందర్భాల్లో కేవలం ఉల్లంఘనుల ఫొటో తీసి ఈ–చలాన్ మాత్రమే పంపిస్తున్నారు. ఈ కారణంగానే రెంటల్ బైక్స్‌పై ఫీట్లు చేస్తున్న, ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు ఆపట్లేదు. కేవలం ఆయా ఉల్లంఘనల్ని ఫొటోలు తీసి ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామా ఆధారంగా సదరు బైక్స్‌ను నిర్వహిస్తున్న సంస్థలకు పంపిస్తున్నారు. ఆ నిర్వాహకులు జరిమానాలు రూ.లక్షల్లో చెల్లిస్తున్నా బైక్స్ వినియోగిస్తున్న ఉల్లంఘనులకు మాత్రం చెక్ పడట్లేదు. ఈ బైక్ యాప్స్‌తో కూడిన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతిలో పడి, వాళ్ళు ఆ వాహనాలు బుక్ చేసుకుని వినియోగించగలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ‘విధిస్తున్నాం’ ఇటీవల కాలంలో నగరంలో పెరిగిపోయిన రెంటల్ బైక్స్ కారణంగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వీటిని వినియోగిస్తున్న యువకులు, మైనర్లు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల్లో అనునిత్యం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి నిబంధనల ప్రకారం ఈ–చలాన్లు విధిస్తున్నాం. ఇటీవలే ఓ సంస్థకు చెందిన ప్రతినిధులు నేరుగా వచ్చి రూ.3 లక్షల జరిమానాలు క్లియర్ చేసి వెళ్ళారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల దృష్టికి తీవ్రమైన ఉల్లంఘనలు వస్తే వెంటనేవాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆయా సంస్థలకుసమాచారం ఇచ్చి అప్పగిస్తున్నారు. ఈ కేసుల్లోనూ జరిమానా విధిస్తున్నారు. ఈ రెంటల్ బైక్స్వినియోగిస్తున్న ఆయతాయిల కారణంగాసాధారణ వాహనచోదకులు ఇబ్బందులుఎదుర్కొవాల్సి వస్తోంది. – సిటీ ట్రాఫిక్ పోలీసులు -
అద్దె బైకులతో అదిరే సవారీ...
ద్విచక్ర వాహనాలు అద్దెకిస్తున్న వీల్ స్ట్రీట్ ♦ గేర్ లెస్ల నుంచి సూపర్ బైక్స్ వరకూ.. ♦ 6 నెలల్లో హైదరాబాద్‌లోనూ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐదో గేరులో దూసుకెళుతూ కూడా ఆరో గేరుంటే బాగుండునని ఆలోచిస్తున్నారు నేటి కుర్రకారు. ‘మామ్ అండ్ డ్యాడ్ గిఫ్ట్’ అనో.. ‘క్యాచ్ మీ ఇఫ్ యు కెన్’ అనో.. బైక్ వెనకాల రాయించుకొని యమా స్పీడుగా దూసుకుపోయే యువతకు అన్నం, నీళ్లు లేకపోయినా రోజు గడుస్తుందేమోగానీ బండి లేనిదే అరగంట కూడా గడవదు. ‘‘బైక్ అంటే సరదా కోసమే కాదు. అవసరంలో ఉపయోగపడాలి. నలుగురు వెరైటీగా ఉందని అబ్బురపడాలి. రోజుకో బైక్ మీద రయ్ మంటూ దూసుకెళ్లాలి’’ ఇది యువత స్ట్రాటజీ. అలాంటి యూత్ పల్స్ యూత్‌కే కరెక్ట్‌గా తెలుస్తుందని నిరూపించారు ఢిల్లీకి చెందిన మోక్షా శ్రీవాస్తవ. అందుకే ద్విచక్ర వాహనాలను అద్దెకిచ్చేందుకు ‘వీల్ స్ట్రీట్’ను ఆరంభించారు. వీల్ స్ట్రీట్ గురించి మరిన్ని విశేషాలను మోక్షా శ్రీవాస్తవ మాటల్లోనే.. రోజు వారీ అవసరాలకు.. నగరం నుంచి శివార్లలో ఉండే కళాశాలకు ఆటోలోనో లేకుంటే మెట్రో రైల్లోనో వెళ్లాలంటే చాలా ఇబ్బంది. రాత్రి సమయాల్లో అమ్మాయిలకైతే మరీను. పోనీ చిన్నపాటి బైకేదైనా కొందామంటే ఖర్చుతో కూడుకున్న పని. వీటన్నింటికి పరిష్కారం చూపిస్తుంది వీల్ స్ట్రీట్. గేరు, గేర్‌లెస్ రెండు రకాల ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇవ్వడమే మా ప్రత్యేకత. టూరిస్టులకు, కోచింగ్‌ల కోసం, ప్రాజెక్ట్ వర్క్ మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి.. వీకెండ్స్‌లో చుట్టాల ఇంటికి వెళ్లేందుకు, ఏదైనా దూరప్రాంతాల్లోని ఈవెంట్లను కవర్ చేయడానికి వెళ్లేందుకు ఈ అద్దె బైకులు చాలా ఉపయోగపడతాయనేది మా అభిప్రాయం. 1,700లకు పైగా వాహనాలు.. ఆన్లైన్, ఎస్ఎంఎస్, వాట్స్ఆప్ల ద్వారా వీల్ స్ట్రీట్ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం 1,700 పైగా ద్విచక్ర వాహనాలు మా దగ్గరున్నాయి. అన్నీ 2012-2015 మధ్య విడుదలైన మోడళ్లే. వీటిలో ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్సన్, సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైకులు కూడా ఉన్నాయి. బైకును బట్టి రోజు వారీ అద్దె ఉంటుంది. మామూలు బైకు అయితే రోజు అద్దె ధర రూ.300, అదే సూపర్ బైక్ అయితే రూ.10 వేల వరకూ ఉంటుంది. నెలా నెలా పెరుగుతున్న ఆదాయం.. కంపెనీ ప్రారంభించిన 6 నెలల వరకు ప్రచారం లేకపోవడంతో వ్యాపారం కాసింత తక్కువే జరిగేది. కానీ, మా ప్రత్యేకతలు, అద్దె ధరలు చూసి వ్యాపారం ఊపందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.90 వేల ఆదాయం గడిస్తే.. మేలో రూ.35 లక్షలు, జూన్‌లో 59 లక్షల ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గంట ముందు బుక్ చేసుకుంటే.. వాహనం కావాలనుకున్న గంట ముందు బుక్ చేసుకుంటే చాలు. బైక్‌ను అద్దెకిచ్చే ముందు ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు బైకును బట్టి రూ.1,000 నుంచి రూ.25 వేల వరకు అడ్వాన్స్‌గా కూడా చెల్లించాల్సి ఉంటుంది. మిలియన్ డాలర్ల పెట్టు బడులు... గతేడాది డిసెంబర్లో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఆర్అండ్బీ పార్ట్నర్స్ వీల్స్ట్రీట్లో రూ.10 లక్షల పెట్టుబడులు పెట్టారు. కంపెనీ విస్తరణ అవసరాల నిమిత్తం మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు బెంగళూరుకు చెందిన ఆటో కంపెనీ సిద్ధంగా ఉంది. 20 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఏడాది కాలంలో మా వెబ్‌సైట్‌ను సందర్శించిన వాళ్ల సంఖ్య 10 కోట్లకు పైమాటే. ప్రస్తుతం నెలకు 900 బుకింగ్స్ అవుతున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్‌లో.. 80కి పైగా డీలర్ల నుంచి అద్దె రూపంలో బైకులు తీసుకొని.. ఢిల్లీలో మాత్రమే సేవలందిస్తున్న వీల్స్ట్రీట్ను మరో రెండు నెలల్లో చంఢీగఢ్, పుణె, డెహ్రాడూన్ ప్రాంతాలకు విస్తరించబోతున్నాం. మరో 6 నెలల్లోగా హైదరాబాద్‌లో సేవలు ఆరంభించబోతున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌లో బైకులు అద్దెకిచ్చే డీలర్లతో సంప్రదింపులు పూర్తిచేశాం. ఎవరైనా వారి బైకును అద్దెకివ్వాలనుకుంటే అగ్రిగేటర్ ఫ్లాట్‌ఫామ్ మీద అద్దెకు తీసుకుంటాం. బైక్ కండిషన్ ఎలా ఉంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది వంటి వివరాలను పరిశీలించాకే బైకును అద్దెకు తీసుకుంటాం.