అద్దె బైకులతో అదిరే సవారీ...
ద్విచక్ర వాహనాలు అద్దెకిస్తున్న వీల్ స్ట్రీట్
♦ గేర్ లెస్‌ల నుంచి సూపర్ బైక్స్ వరకూ..
♦ 6 నెలల్లో హైదరాబాద్‌లోనూ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐదో గేరులో దూసుకెళుతూ కూడా ఆరో గేరుంటే బాగుండునని ఆలోచిస్తున్నారు నేటి కుర్రకారు. ‘మామ్ అండ్ డ్యాడ్ గిఫ్ట్’ అనో.. ‘క్యాచ్ మీ ఇఫ్ యు కెన్’ అనో.. బైక్ వెనకాల రాయించుకొని యమా స్పీడుగా దూసుకుపోయే యువతకు అన్నం, నీళ్లు లేకపోయినా రోజు గడుస్తుందేమోగానీ బండి లేనిదే అరగంట కూడా గడవదు. ‘‘బైక్ అంటే సరదా కోసమే కాదు. అవసరంలో ఉపయోగపడాలి. నలుగురు వెరైటీగా ఉందని అబ్బురపడాలి. రోజుకో బైక్ మీద రయ్ మంటూ దూసుకెళ్లాలి’’ ఇది యువత స్ట్రాటజీ. అలాంటి యూత్ పల్స్ యూత్‌కే కరెక్ట్‌గా తెలుస్తుందని నిరూపించారు ఢిల్లీకి చెందిన మోక్షా శ్రీవాస్తవ. అందుకే ద్విచక్ర వాహనాలను అద్దెకిచ్చేందుకు ‘వీల్ స్ట్రీట్’ను ఆరంభించారు. వీల్ స్ట్రీట్ గురించి మరిన్ని విశేషాలను మోక్షా శ్రీవాస్తవ మాటల్లోనే..
రోజు వారీ అవసరాలకు..
నగరం నుంచి శివార్లలో ఉండే కళాశాలకు ఆటోలోనో లేకుంటే మెట్రో రైల్‌లోనో వెళ్లాలంటే చాలా ఇబ్బంది. రాత్రి సమయాల్లో అమ్మాయిలకైతే మరీను. పోనీ చిన్నపాటి బైకేదైనా కొందామంటే ఖర్చుతో కూడుకున్న పని. వీటన్నింటికి పరిష్కారం చూపిస్తుంది వీల్ స్ట్రీట్. గేరు, గేర్‌లెస్ రెండు రకాల ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇవ్వడమే మా ప్రత్యేకత. టూరిస్టులకు, కోచింగ్‌ల కోసం, ప్రాజెక్ట్ వర్క్ మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి.. వీకెండ్స్‌లో చుట్టాల ఇంటికి వెళ్లేందుకు, ఏదైనా దూరప్రాంతాల్లోని ఈవెంట్లను కవర్ చేయడానికి వెళ్లేందుకు ఈ అద్దె బైకులు చాలా ఉపయోగపడతాయనేది మా అభిప్రాయం.
1,700లకు పైగా వాహనాలు..
ఆన్‌లైన్, ఎస్‌ఎంఎస్, వాట్స్‌ఆప్‌ల ద్వారా వీల్ స్ట్రీట్ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం 1,700 పైగా ద్విచక్ర వాహనాలు మా దగ్గరున్నాయి. అన్నీ 2012-2015 మధ్య విడుదలైన మోడళ్లే. వీటిలో ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్‌సన్, సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైకులు కూడా ఉన్నాయి. బైకును బట్టి రోజు వారీ అద్దె ఉంటుంది. మామూలు బైకు అయితే రోజు అద్దె ధర రూ.300, అదే సూపర్ బైక్ అయితే రూ.10 వేల వరకూ ఉంటుంది.
నెలా నెలా పెరుగుతున్న ఆదాయం..
కంపెనీ ప్రారంభించిన 6 నెలల వరకు ప్రచారం లేకపోవడంతో వ్యాపారం కాసింత తక్కువే జరిగేది. కానీ, మా ప్రత్యేకతలు, అద్దె ధరలు చూసి వ్యాపారం ఊపందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.90 వేల ఆదాయం గడిస్తే.. మేలో రూ.35 లక్షలు, జూన్‌లో 59 లక్షల ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
గంట ముందు బుక్ చేసుకుంటే..
వాహనం కావాలనుకున్న గంట ముందు బుక్ చేసుకుంటే చాలు. బైక్‌ను అద్దెకిచ్చే ముందు ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు బైకును బట్టి రూ.1,000 నుంచి రూ.25 వేల వరకు అడ్వాన్స్‌గా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మిలియన్ డాలర్ల పెట్టు బడులు...
గతేడాది డిసెంబర్‌లో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఆర్‌అండ్‌బీ పార్ట్‌నర్స్ వీల్‌స్ట్రీట్‌లో రూ.10 లక్షల పెట్టుబడులు పెట్టారు. కంపెనీ విస్తరణ అవసరాల నిమిత్తం మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు బెంగళూరుకు చెందిన ఆటో కంపెనీ సిద్ధంగా ఉంది. 20 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఏడాది కాలంలో మా వెబ్‌సైట్‌ను సందర్శించిన వాళ్ల సంఖ్య 10 కోట్లకు పైమాటే. ప్రస్తుతం నెలకు 900 బుకింగ్స్ అవుతున్నాయి.
6 నెలల్లో హైదరాబాద్‌లో..
80కి పైగా డీలర్ల నుంచి అద్దె రూపంలో బైకులు తీసుకొని.. ఢిల్లీలో మాత్రమే సేవలందిస్తున్న వీల్‌స్ట్రీట్‌ను మరో రెండు నెలల్లో చంఢీగఢ్, పుణె, డెహ్రాడూన్ ప్రాంతాలకు విస్తరించబోతున్నాం. మరో 6 నెలల్లోగా హైదరాబాద్‌లో సేవలు ఆరంభించబోతున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌లో బైకులు అద్దెకిచ్చే డీలర్లతో సంప్రదింపులు పూర్తిచేశాం. ఎవరైనా వారి బైకును అద్దెకివ్వాలనుకుంటే అగ్రిగేటర్ ఫ్లాట్‌ఫామ్ మీద అద్దెకు తీసుకుంటాం. బైక్ కండిషన్ ఎలా ఉంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది వంటి వివరాలను పరిశీలించాకే బైకును అద్దెకు తీసుకుంటాం.