వాణిజ్య సంస్థల వాహనాలపై దృష్టి పెట్టిన పోలీసులు
న్యూఢిల్లీ : దేశరాజధానిలో వాణిజ్య సంస్థల వాహనాల ప్రమాదాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు నడుం బిగించారు. జాతీయ రహదారులతోపాటు కొన్ని ప్రధానరోడ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. గత ఆరు రోజులలో 3,625 వాహనాలపై విచారణకు ఆదేశించారు. వాణిజ్య సంస్థల వాహనాలు క్రమశిక్షణగా నడిపేందుకు, రోడ్లపై వేగంగా, నిర్లక్ష్యంగా వెళ్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు.
రాత్రిపూట కూడా తనిఖీలు నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్టు ఆయన చెప్పారు. 3,265 వాహనాల్లో వేగంగా నడిపినందుకు 2,100 వాహనాలను, ఫిట్‌నెస్ లేనందుకుగాను 67 వాహనాలను, ఇతర వాహనాలను అక్రమంగా ఓవర్‌టేక్ చేసినందుకు మరో 544 వాహనాలను సీజ్ చేసినట్లు శుక్లా వివరించారు.
రాత్రిపూట నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నందుకుగాను 47 కేసులు నమోదు చేశామన్నారు. ప్రమాదాలను నివారించడంలో భాగంగా నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతున్న డ్రైవర్లకు ఎక్కువ మొత్తంలో జరిమానా విధిస్తున్నట్లు శుక్లా తెలిపారు. రాత్రి వేళల్లో వాణిజ్య సంస్థల వాహనాలు, ప్రత్యేకించి చెత్తను తరలించే వాహనాలు, ట్రక్కులను అతివేగంగా, ప్రమాదకరంగా నడపడం, రెడ్ సిగ్నల్స్‌ను జంప్ చేయడం, తప్పుగా ఓవర్‌టేక్ చేయడం, ఓవర్ లోడ్ వంటి ఉల్లంఘనలను గమనించిన తరువాతే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ట్రాఫిక్ ఏసీపీ శుక్లా అన్నారు.