Anil Shukla
-
ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు
వాణిజ్య సంస్థల వాహనాలపై దృష్టి పెట్టిన పోలీసులు న్యూఢిల్లీ : దేశరాజధానిలో వాణిజ్య సంస్థల వాహనాల ప్రమాదాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు నడుం బిగించారు. జాతీయ రహదారులతోపాటు కొన్ని ప్రధానరోడ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. గత ఆరు రోజులలో 3,625 వాహనాలపై విచారణకు ఆదేశించారు. వాణిజ్య సంస్థల వాహనాలు క్రమశిక్షణగా నడిపేందుకు, రోడ్లపై వేగంగా, నిర్లక్ష్యంగా వెళ్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు. రాత్రిపూట కూడా తనిఖీలు నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్టు ఆయన చెప్పారు. 3,265 వాహనాల్లో వేగంగా నడిపినందుకు 2,100 వాహనాలను, ఫిట్నెస్ లేనందుకుగాను 67 వాహనాలను, ఇతర వాహనాలను అక్రమంగా ఓవర్టేక్ చేసినందుకు మరో 544 వాహనాలను సీజ్ చేసినట్లు శుక్లా వివరించారు. రాత్రిపూట నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నందుకుగాను 47 కేసులు నమోదు చేశామన్నారు. ప్రమాదాలను నివారించడంలో భాగంగా నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతున్న డ్రైవర్లకు ఎక్కువ మొత్తంలో జరిమానా విధిస్తున్నట్లు శుక్లా తెలిపారు. రాత్రి వేళల్లో వాణిజ్య సంస్థల వాహనాలు, ప్రత్యేకించి చెత్తను తరలించే వాహనాలు, ట్రక్కులను అతివేగంగా, ప్రమాదకరంగా నడపడం, రెడ్ సిగ్నల్స్‌ను జంప్ చేయడం, తప్పుగా ఓవర్టేక్ చేయడం, ఓవర్ లోడ్ వంటి ఉల్లంఘనలను గమనించిన తరువాతే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ట్రాఫిక్ ఏసీపీ శుక్లా అన్నారు. -
సిగ్నల్‌తో సమస్య వస్తే..
న్యూఢిల్లీ: మీరు ముఖ్యమైన పనిపై వెళ్తూ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగారు. ఎంతసేపటికీ పచ్చలైలు వెలగకపోవడంతో సమయమంతా వృథా అవుతోంది. ఇలాం టి సందర్భాల్లో ట్రాఫిక్ వ్యవస్థను విమర్శించి ఊరుకోకుండా ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇక నుంచి ప్రతి కూడలి వద్ద ఉన్న సిగ్నల్లైట్లకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తారు. అవి సరిగ్గా పనిచేయకుంటే దాని నంబరును నమోదు చేసుకొని ట్రాఫిక్‌శాఖ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రాబోయే కొన్ని నెలల్లో దశలవారీగా ఈ విధానాన్ని ప్రవేశపెడతారు. ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నలింగ్ వ్యవస్థను ట్రాఫిక్ పోలీసులే నిర్వహిస్తుంటారు. వాహనాల రద్దీని బట్టి సిగ్నళ్లను మారుస్తుంటారు. అయితే సమీపంలో ఉండే ఇతర సిగ్నళ్లు, వాహనాల రద్దీ తెలుసుకోవడానికి వీలుగా వీళ్లు ఆయా ప్రాంతాల ట్రాఫిక్ అధికారులతో మాట్లాడుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు పచ్చలైటు రావడం ఆలస్యమవుతోంది. ఫలితంగా రద్దీ సమయాల్లో వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందితో వాదులాటకు దిగుతున్నారు. ఈ కొత్త విధానంలో భాగంగా మౌరిస్నగర్, మాయాపురి కూడళ్ల సిగ్నల్లైట్లకు ఇది వరకే నంబర్లు వేశారు. ఫలితంగా ఈ కూడళ్ల వద్ద సిగ్నళ్లను సిబ్బంది నియంత్రిస్తున్నారా లేదా స్వయంచాలితంగా పనిచేస్తున్నాయా అనేది కంట్రోల్‌రూమ్ అధికారులకు సులువుగా తెలిసిపోతుంది. వేగంగా సిగ్నళ్లను మార్చడం వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి వీలుగా నంబర్ల వ్యవస్థను మరింత ఆధునీకరిస్తామని ట్రాఫిక్ విభాగం ఏసీపీ అనిల్ శుక్లా అన్నారు. సిగ్నల్లైట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు చూపించే ప్రత్యేక వ్యవస్థను కూడా కంట్రోల్రూముల్లో త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ‘ఏదైనా కూడలి వద్ద సిగ్నల్లైటు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారుడు భావిస్తే మాకంట్రోల్రూమ్ హెల్ప్‌లైన్ లేదా సంబంధిత పీసీఆర్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. మేం తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఇందుకోసం సిగ్నల్ స్తంభాల వివరాలతో కూడిన పట్టికలు తయారు చేశాం’ అని సీనియర్ అధికారి ఒకరు అన్నారు.