సిగ్నల్‌తో సమస్య వస్తే..
Published Fri, Nov 29 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
న్యూఢిల్లీ: మీరు ముఖ్యమైన పనిపై వెళ్తూ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగారు. ఎంతసేపటికీ పచ్చలైలు వెలగకపోవడంతో సమయమంతా వృథా అవుతోంది. ఇలాం టి సందర్భాల్లో ట్రాఫిక్ వ్యవస్థను విమర్శించి ఊరుకోకుండా ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇక నుంచి ప్రతి కూడలి వద్ద ఉన్న సిగ్నల్‌లైట్లకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తారు. అవి సరిగ్గా పనిచేయకుంటే దాని నంబరును నమోదు చేసుకొని ట్రాఫిక్‌శాఖ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రాబోయే కొన్ని నెలల్లో దశలవారీగా ఈ విధానాన్ని ప్రవేశపెడతారు.
ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నలింగ్ వ్యవస్థను ట్రాఫిక్ పోలీసులే నిర్వహిస్తుంటారు. వాహనాల రద్దీని బట్టి సిగ్నళ్లను మారుస్తుంటారు. అయితే సమీపంలో ఉండే ఇతర సిగ్నళ్లు, వాహనాల రద్దీ తెలుసుకోవడానికి వీలుగా వీళ్లు ఆయా ప్రాంతాల ట్రాఫిక్ అధికారులతో మాట్లాడుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు పచ్చలైటు రావడం ఆలస్యమవుతోంది. ఫలితంగా రద్దీ సమయాల్లో వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందితో వాదులాటకు దిగుతున్నారు. ఈ కొత్త విధానంలో భాగంగా మౌరిస్‌నగర్, మాయాపురి కూడళ్ల సిగ్నల్‌లైట్లకు ఇది వరకే నంబర్లు వేశారు. ఫలితంగా ఈ కూడళ్ల వద్ద సిగ్నళ్లను సిబ్బంది నియంత్రిస్తున్నారా లేదా స్వయంచాలితంగా పనిచేస్తున్నాయా అనేది కంట్రోల్‌రూమ్ అధికారులకు సులువుగా తెలిసిపోతుంది.
వేగంగా సిగ్నళ్లను మార్చడం వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి వీలుగా నంబర్ల వ్యవస్థను మరింత ఆధునీకరిస్తామని ట్రాఫిక్ విభాగం ఏసీపీ అనిల్ శుక్లా అన్నారు. సిగ్నల్‌లైట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు చూపించే ప్రత్యేక వ్యవస్థను కూడా కంట్రోల్‌రూముల్లో త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ‘ఏదైనా కూడలి వద్ద సిగ్నల్‌లైటు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారుడు భావిస్తే మాకంట్రోల్‌రూమ్ హెల్ప్‌లైన్ లేదా సంబంధిత పీసీఆర్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. మేం తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఇందుకోసం సిగ్నల్ స్తంభాల వివరాలతో కూడిన పట్టికలు తయారు చేశాం’ అని సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
Advertisement