కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించడానికి ఢిల్లీ సచివాలయం సన్నద్ధం
Published Thu, Dec 26 2013 10:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌పార్టీ ప్రభుత్వానికి ఢిల్లీ సచివాలయం స్వాగతించడానికి సన్నద్ధమవుతోంది. పూర్వ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రుల పేర్లను తుడిపించి, గదులను శుభ్రం చేయిస్తున్నారు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని ఆఘామేఘాల మీద రప్పించి విధుల్లో చేర్పిస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాంలీలా మైదాన్‌లో పదవీ ప్రమాణ స్వీకారాలు చేయనున్నట్లు ఆప్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు కేజ్రీవాల్ సంసిద్ధతను వ్యక్తం చేసిన వెంటనే పాత ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు నిర్వహించిన నలుగురు మంత్రుల గదుల మీద నేమ్ ప్లేట్లను తొలిగించారు. మంగళవారం మధ్యాహ్నం పాలన విభాగం తక్కిన మంత్రుల గదుల నేమ్ ప్లేట్లను కూడా తొలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. 15 సంవత్సరాలు పరిపాలన నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాపాలదారులను మార్చడానికి అధికారులు కొంత తత్తరపడినట్లు కనిపించారు.
ఉరుకలెత్తుతున్న యువరక్తం అధికారంలోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని కొందరు అధికారులు తెలిపారు. ‘‘బహుశ మేమంతా ఓ ప్రత్యేక తరహాలో పనిచేయాల్సి వస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ మార్పు సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాం. మేము పనిచేయడానికి సిద్ధమయ్యే ఉన్నాం. ఆందోళన పడాల్సింది ఏ మాత్రం లేదు’’ అని వారి మనుసులో మాటలను పంచుకున్నారు. కొత్త ప్రభుత్వ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే వివిధ శాఖ వ్యవహారాలను చూస్తున్న అధికారుల వివరాలను సేకరించినట్లు వినికిడి. వారి వారి పనివిధానం, పదవీ కాలంలో సాధించిన ఫలితాలను బేరీజు వేసినట్లు భావిస్తున్నారు. వివాదాలు, కుంభకోణాల్లో భాగస్వాములుగా విమర్శలు ఎదుర్కొన్న వారి పేర్ల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచుకున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement