భివండీ , న్యూస్‌లైన్: పట్టణంలో హనుమజ్జయంతి ఘనంగా జరిగింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు,కీర్తనలతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ జయ హనుమాన్ సేవా సమితి 10వ వార్షికోత్సవాన్ని చందన్‌బాగ్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించింది.
ఇందులోభాగంగా సోమవారం 11 గంటల నుండి మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల వరకు అఖండ రామాయణ పారాయణంతోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం పల్లకీ ఊరేగింపు జరి గింది. 108 మంది మహిళలు నెత్తిపై కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపు సమయంలో దారిపొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి నిర్వహించిన అన్న దాన కార్యక్రమంలో సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారని అధ్యక్షుడు గుండు స్వామి, కూరపాటి సుదర్శన్, ముటికిరి శంకర్ తెలిపారు. ఈ ఊరేగింపులో స్థానికులతోపాటు మాజీ కార్పొరేటర్ సాయినాధ్ పవార్ (బావు) పాల్గొన్నారు.
శ్రీ పంచముఖి హనుమాన్ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...
శ్రీ పంచముఖి హనుమాన్ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదో వార్షికోత్సవ మహా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 80 మంది భక్తులతో తొమ్మిది హనుమాన్ యజ్ఞాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిర్వహించి మధ్యాహ్నం మహా హారతి ఇచ్చారు. ఆ తర్వాత అన్నదానం చేశారు. అన్నదాన కార్యక్రమంలో సుమారు ఐదువేల మంది భక్తులు పాల్గొన్నారని ట్రస్ట్ అధ్యక్షుడు సాక రాములు, గురుస్వామి చాట్ల లక్ష్మణ్ తెలిపారు. కాగా గత నెల ఆరో తేదీన మాలధారణ చేసిన 80 మంది భక్తులుకూడా నిత్య పూజా కార్యక్రమాలు హోమాలు, అభిషేకాలతోపాటు నిత్యాన్నదానం చేశారు. వీరంతా మహాపూజలో పాల్గొన్నారు.
శ్రీ హనుమాన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో...
శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో 12 వార్షికోత్సవ మహాపూజా కార్యక్రమాలు జరిగాయి. 41 రోజుల క్రితం మాలధారణ చేసిన 40 మంది భక్తులు మహాపూజలో పాల్గొన్నారు. వీరిలో మహిళా భక్తులు కూడా ఉన్నారు. ఉదయం సహస్రనామావళితో అర్చనలు, శ్రీచక్ర సహస్రనామాలతో అభిషేకాలు, హనుమాన్ యజ్ఞం తదితర కార్యక్రమాలు నిర్వహించామని గురుస్వామి కోడూరి మల్లేశం తెలిపారు. మధ్యాహ్నం మహాహారతి ఇచ్చామన్నారు. ఆ తర్వాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండువేల మంది భక్తులు పాల్గొన్నారని వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి నాగేష్, అధ్యక్షుడు చిన్నం రమేశ్ తెలిపారు. మంగళవారం రాత్రి వజ్రేశ్వరి పుణ్యక్షేత్రంలో మాలధారులంతా దీక్ష విరమించారని ప్రధాన కార్యదర్శి కుస్మ బాలకిషన్ చెప్పారు.
వర్లిలో...
సాక్షి, ముంబై: వర్లీ బీడీడీ చాల్స్ నంబర్ 111-112 మధ్యనున్న ‘శ్రీ మహారుద్ర హనుమాన్ మందిరం’ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది వజ్రోత్సవాలు కావడంతో నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ మందిరాన్ని 1939లో బింగి విఠల్, గుడ్ల గంగారాం, రాపెల్లి లక్ష్మణ్, పిన్నంశెట్టి నర్సయ్య, బాక్సర్ హనుమంతు, గుడ్ల ఎర్రన్న, చాట్ల మోతీరాం, ఎల్ల భూమయ్య, నల్లమడుగు గంగారాం తదితరులు నిర్మించారు. కాగా, ఉదయం 5.30 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించారు. సాయంత్రం మందిరం ఆధ్వర్యంలో సుమారు ఆరు వేల మందికిపైగా అన్నదానం చేసినట్లు అధ్యక్షుడు గుద్దేటి నారాయణ, ఉపాధ్యక్షుడు సురేశ్ శేడ్గే చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గాజంగి వెంకటేశ్, ఉప కార్యదర్శి సందీప్ షిండే, కోశాధికారి చిలివేరి చంద్రశేఖర్, ఉప కోశాధికారి చిప్ప విజయ్, ఆలయ కన్వీనర్, పూజారి శివరాత్రి పురుషోత్తం, లక్ష్మణ్, బింగి సావన్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హనుమజ్జయంతి
Published Wed, Apr 16 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
Advertisement
Advertisement