లైకా ఖాతాలో ధనుష్ రెండు చిత్రాలు
ధనుష్ నటుడిగా, నిర్మాతగా రెండు పడవలపై పయనిస్తున్నారు. అయితే ఈ రెండింటి పైనా సక్సెస్‌ఫుల్‌గా స్వారీ చేయడం విశేషం. హీరోగా వీఐపీ-2తో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న ధనుష్ నిర్మాతగా విచారణై, నానూ రౌడీదాన్ చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తున్నారు. వండర్ మార్ ప్రయివెట్ లిమిటెడ్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటి వరకు 3, ఎదిర్‌నీశ్చల్, వెలై ఇల్లా పట్టాదారి, కాక్కముట్టై వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
వీటిలో 3 చిత్రం వాణిజ్య పరంగా లభాలను తెచ్చిపెట్టకపోయినా అందులోని వై దిస్ కొలవెర్రి డీ పాట ఆ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇక వెలై ఇల్లా పట్టాదారి ఘన విజయం సాధించింది. కాక్కముట్టై కమర్శియల్‌గా జాతీయ అవార్డుల పరంగానూ అనూహ్య ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. దీంతో సాధారణంగానే ధనుష్ వండర్ బార్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. కాగా తాజాగా ఆయన నిర్మిస్తున్న విచారణై చిత్రానికి విడుదలకు ముందే అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసింది.
కారణం ఈ చిత్రం వెన్నీస్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పోటీకి ఎంపికైంది. సముద్రకని, దినేష్, నందిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. ఈ చిత్ర ప్రపంచ విడుదల హక్కుల్ని కత్తి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్ సంస్థ పొందింది. అలాగే ధనుష్ నిర్మిస్తున్న మరో చిత్రం నానూ రౌడీదాన్ తమిళనాడు విడుదల హక్కుల్ని లైకా సంస్థ సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం పైనా మంచి అంచనాలున్నాయి.