రజనీకి గాలం | Did Modi snub Rajinikanth by choosing Kamal Haasan? | Sakshi
Sakshi News home page

రజనీకి గాలం

Published Mon, Oct 6 2014 12:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

రజనీకి గాలం - Sakshi

రజనీకి గాలం

 సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎలాగైనా రాజకీయాల్లోకి దింపడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అధిష్టానం వ్యూహాల అమలు లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం లత రజనీకాంత్‌ను ఆమె కలుసుకోవడంతోపాటుగా, రజనీ, కమల్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి దించేందుకు గతంలో అభిమాన లోకం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అభిమానుల ఒత్తిడి శ్రుతి మించడంతో తలొగ్గిన రజనీ కాంత్ ‘దేవుడు ఆదేశిస్తే...
 
 రాజకీయాల్లోకి వస్తా..’ అన్న మెలిక పెట్టారు. అభిమానుల నోళ్లకు తాళం వేయించారు. అయితే, ఎన్నికల సమయాల్లో ‘రజనీ రాజకీయాల్లోకి రా...!’ అన్న  నినాదం తెరపైకి రావడం సహజంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నాలు వేగవంత మయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో రజనీ కాంత్‌కు ఉన్న మిత్రత్వం ఇందుకు ఓ కారణం. దక్షిణాదిలో కర్ణాటకలో బలంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీజేపీ పరిస్థితి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభావంతో ఓ సీటును తన్నుకెళ్లినా, ఈ ప్రభావానికి సినీ గ్లామర్‌ను తోడు చేసి తమిళనాడులోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం వ్యూహ రచనల్లో ఉంది. ఇందుకు గాను రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు.
 
 రంగంలోకి తమిళి సై : తొలి విడత మంతనాల బాధ్యతల్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌కు బీజేపీ అధిష్టానం అప్పగించింది. దీంతో రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దించడమే లక్ష్యంగా తన ప్రయత్నాల్ని తమిళి సై వేగవంతం చేశారు. రజనీ కాంత్‌తో సంప్రదింపులకు ముందుగా ఆయన సతీమణి లతారజనీకాంత్‌తో భేటీ కావడం గమనార్హం. నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు బొమ్మల కొలువును రజనీ కాంత్ ఇంట్లో ఏర్పాటు చేశారు. చివరి రోజు పోయేస్ గార్డెన్‌లోని ఆయన ఇంటికి ఈ బొమ్మల కొలువు సందర్శన నిమిత్తం తమిళి సై సౌందరరాజన్ వెళ్లారు. బొమ్మల కొలువుకు పూజల అనంతరం లతా రజనీ కాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేగా సమయంలో రజనీ కాంత్ ఇంట్లో లేని దృష్ట్యా, తాను చెప్పదలచుకున్న విషయాల్ని లతా రజనీ కాంత్ ముందు ఉంచినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మరో మారు వచ్చి రజనీ కాంత్‌ను కలుస్తానని చెప్పి, మోదీ జీవిత చరిత్ర పుస్తకాన్ని తమిళి సై అందజేశారు.  
 
 వాస్తవమే: తాను రజనీ కాంత్ ఇంటికి వెళ్లడం వాస్తవమేనని, లత రజనీ కాంత్‌తో భేటీ అయినట్టు తమిళి సై స్పష్టం చేశారు. రజనీ కాంత్, ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రులు అని పేర్కొంటూ, రజనీ కాంత్, కమల్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం  కరువవుతోందన్నారు. ఈ సమయంలో రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం లేదా, బీజేపీకి మద్దతుగా నిలబడటం లక్ష్యంగా తమ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందేనని, అవినీతి ఊబిలో కూరుకున్న ఈ పార్టీలకు పట్టం కట్టే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని పేర్కొన్నారు. అందుకే సమాజ హితాన్ని కాంక్షించే రజనీకాంత్, కమల్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో రజనీ ఏదో ఒక రూపంలో గళం వినిపిస్తున్నారని, ప్రస్తుతం అదే పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దాన్ని ఓ మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం  ఉందన్నారు. రజనీ కాంత్‌ను త్వరలో కలవనున్నట్టు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement