ఢిల్లీ క్రైమ్‌ పోలీసుల చెన్నై పర్యటన వాయిదా | Dinakaran two leaves symbol case: Delhi police crime branch postpones chennai visit | Sakshi
Sakshi News home page

ఢిల్లీ క్రైమ్‌ పోలీసుల చెన్నై పర్యటన వాయిదా

Published Tue, Apr 18 2017 11:56 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

Dinakaran two leaves symbol case: Delhi police crime branch postpones chennai visit

న్యూఢిల్లీ: రెండాకులు గుర్తుకు కేటాయించాలంటూ లంచం కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తమ చెన్నై పర్యటను వాయిదా వేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముందుగా ఢిల్లీలో విచారణ పూర్తి చేసిన అనంతరం చెన్నై వెళ్లనున్నారు. అంతేకాకుండా చెన్నై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దినకరన్‌ను ఢిల్లీ తీసుకు వచ్చే విచారణ జరపాలని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆర్కేనగర్‌కు మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా ఎలాగైనా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్‌ భావించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక, రెండాకుల చిహ్నంపై సోమవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో మళ్లీ విచారణ జరగనున్నట్లు తెలుసుకుని ఆయన తన  ప్రయత్నాల వేగం పెంచారు. ఎన్నికల కమిషన్‌లోని ఒక అధికారి ద్వారా పని కానిచ్చేందుకు బడా బ్రోకర్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల ‡హోటల్‌లో దినకరన్‌ తరఫున బేరసారాలు సాగుతున్నట్లు క్రైం బ్రాంచ్‌ పోలీసులకు ఉప్పందడంతో ఒక్కసారిగా దాడులు జరిపారు.

కర్ణాటకకు చెందిన సుఖేష్‌ చంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని  రూ.1.30 కోట్లు, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి చెందిన ఒక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండాకుల చిహ్నం సాధించి పెడతానని దినకరన్‌తో రూ.60 కోట్లు బేరం కుదుర్చుకున్న సుఖేష్‌ రూ.1.30 కోట్ల అడ్వాన్సు పొందాడు.

దీంతో సుఖేష్‌ వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌పై పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో దినకరన్‌కు నోటీసులు ఇచ్చే అంశం వాయిదా పడింది. కాగా దినకరన్‌ మాత్రం ఈ సుఖేష్‌ ఎవరో తనకు తెలియదు, సమన్లు అందితే చట్టం ద్వారా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన న్యాయవాదులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాగా  తాను చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా ఢిల్లీ పోలీసుల చేతుల్లో దినకరన్‌ కటకటాలపాలు కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement