కుదరని సయోధ్య
మేయర్ ఎంపికపై బెడిసికొడుతున్న వ్యూహం
కాంగ్రెస్‌లో రాజుకుంటున్న అసమ్మతి
జేడీఎస్‌తో పొత్తుకు సై అంటున్న సిద్ధు గ్రూప్
కూడదంటున్న పరమేశ్వర మద్దతుదారులు
బెంగళూరు : మేయర్ ఎంపిక విషయంలో జేడీఎస్‌తో పొత్తు వ్యవహారం కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేస్తోంది. ఆ పార్టీలో మరోసారి సీఎం సిద్ధు గ్రూపు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వర్గం అన్న వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధు అండ్ కో మొగ్గు చూపిస్తుండగా పరమేశ్వర్ వర్గం వ్యతిరేకిస్తోంది. బీబీఎంపీ ఎన్నికల్లో 76 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్య బలంతో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పదవిని దక్కించుకోవడం అసాధ్యం. దీంతో ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా ‘సిద్ధరామయ్య అండ్ కో’ 14 వార్డులను గెలుచుకున్న జేడీఎస్‌తో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య తెర వెనక నుంచి మంత్రాంగం నడిపిస్తుండగా బెంగళూరుకు చెందిన బైరతీ బసవరాజు, మునిరత్నా, ఎస్‌టీ సోమశేఖర్ తెరముందు జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులను లాబీయింగే చేస్తున్నారు. ఈ ముగ్గురూ సీఎం సిద్ధరామయ్యకు అప్తులన్న విషయం బహిరంగ రహస్యమే. అయితే పరమేశ్వర్‌తో పాటు మూలతహా కాంగ్రెస్ పార్టీకు చెందిన కొందరు నాయకులు జేడీఎస్‌తో పొత్తుకు సమ్మతించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాజకీయాల్లో పొత్తులు సాధారణమే అయినా గత అనుభవాల దృష్ట్యా జేడీఎస్ స్నేహహస్తం ఇచ్చినట్లే ఇచ్చే తర్వాత ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతుందని పరమేశ్వర్‌తో బాటు మిగిలిన కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చినా అధికారం కోసం రాజకీయ బద్ధశత్రువైన జేడీఎస్‌తో కలవడం రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఇబ్బంది కరంగా మారుతుందనేది వారి వాదన. ఇదే విషయమై పరమేశ్వర్, సిద్ధరామయ్య మధ్య శనివారం పొద్దు పొయిన తర్వాత ఫోన్‌లో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన తనతో సంప్రదించకుండా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ పరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ఈ విషయమై వారి నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాన్ని కోరుతా, అవసరమైతే క్రమశిక్షణా చర్యలకు వెనకాడబోనని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు.