► ఆగిన యువతి నిశ్ఛితార్థం
► రూ.2 లక్షల నష్టపరిహారానికి ఉత్తర్వులు
టీ.నగర్: అమెరికా నుంచి చెన్నైకి వచ్చేందుకు టిక్కెట్ ఉన్నప్పటికీ విమాన ప్రయాణానికి అధికారులు నిరాకరించడంతో ఓ యువతి నిశ్చితార్థం ఆగిపోయింది. దీంతో సదరు యువతికి రూ.2 లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టు ఉత్తర్వులిచ్చింది. వివరాలు. చెన్నైకి చెందిన టి.ఎ.ప్రసన్న కుమార్తె ఇంద్రప్రియ తండ్రితోపాటు అమెరికాలో ఉంటున్నారు. ఇంద్రప్రియకు వివాహం నిశ్చయమై, 2013 ఫిబ్రవరి 8న చెన్నైలో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
ఇందుకోసం తండ్రి, కుమార్తె ఇరువురూ ఫిబ్రవరి 5న అమెరికా నుంచి చెన్నై బయలుదేరారు. ఇందుకోసం మేక్ మై ట్రిప్ అనే ట్రావెల్స్ సంస్థ ద్వారా విమాన టిక్కెట్ రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికా మిన్నొపోలిస్ నగరం నుంచి ఢిల్లీ వచ్చేందుకు టిక్కెట్ రిజర్వేషన్ జరిగింది. మిన్నొపోలిస్ నగరం నుంచి నెదర్‌లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాం నగరానికి డెల్టా ట్రావెల్స్ విమానం ద్వారా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మారి డెల్టా ఎయిర్‌వేస్ మరో విమానం ద్వారా చెన్నై వచ్చేందుకు టిక్కెట్ ఇచ్చారు.
ఇరువురూ మిన్నొపోలిస్ విమానాశ్రయానికి వెళ్లగా వారికి డెల్టా ఎయిర్‌లైన్ విమాన ఉద్యోగులు ‘బోర్డింగ్ పాస్’ ఇచ్చేందుకు నిరాకరించారు. విమానంలో సీటు లేదని తిరస్కరించారు. దీంతో తగిన సమయంలో వారు చెన్నై వచ్చేందుకు వీలుకాలేదు. దీంతో ఇంద్రప్రియ నిశ్ఛితార్థం ఆగిపోయింది. తర్వాత వారిరువురూ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం ద్వారా ఫిబ్రవరి 21న చెన్నై చేరుకున్నారు. ఇందుకోసం వారికి రూ.2.80లక్షలు ఖర్చయ్యింది.
దీనిపై వారు చెన్నైలోని వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జయబాలన్, సభ్యులు కలైయరసి సమక్షంలో విచారణ చేపట్టారు. ఇందులో మేక్ మై ట్రిప్ సంస్థ తన వాదనలో ఇరువురు తగిన సమయంలో చెన్నై చేరుకోలేదని, అంతేకాకుండా అనేక నిబంధనలతో టిక్కెట్ అందజేశామని, అందుచేత వారికి నష్టపరిహారం ఇవ్వడం కుదరదని పేర్కొంది. దీనిని వినియోగదారుల కోర్టు అంగీకరించలేదు. మేక్ మై ట్రిప్ సంస్థ, డెల్టా ఎయిర్‌లైన్ సంస్థ రూ.91 వేల టిక్కెట్ చార్జీని, రూ.1.96లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇటీవల ఉత్తర్వులిచ్చింది.
విమాన ప్రయాణానికి నిరాకరణ
Published Tue, Jul 18 2017 4:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
Advertisement