విజయధరణికి వారెంట్
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయధరణికి నాగర్‌కోయిల్ కోర్టు పిటీ వారెంట్ జారీ చేసింది. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలంటూ న్యాయమూర్తి శశికుమార్ ఉత్తర్వులతో కాంగ్రెస్ వర్గాలు విస్మయంలో పడ్డారు. కన్యాకుమారి జిల్లా విలవన్‌కోడు నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి విజయధరణి అసెంబ్లీ మెట్లు ఎక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆమె కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా సాగించారు.
టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌తో కలిసి కన్యాకుమారి జిల్లా కరుంగల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన విజయధరణి నోరు జారారు. సీఎం జయలలితను ఉద్దేశించి ఆధార రహిత ఆరోపణలు గుప్పించారు. తీవ్రస్థాయిలో ఆమెతో పాటు ఈవీకేఎస్ కూడా రెచ్చిపోయి ప్రసంగాన్ని సాగించారు. ఆ ఇద్దరి ప్రసంగాలు సీఎం పరువుకు భంగం కల్గే విధంగా ఉందంటూ ప్రభుత్వ న్యాయవాది జ్ఞానశేఖరన్ రంగంలోకి దిగారు.
ఈవీకేఎస్, విజయధరణిలకు వ్యతిరేకంగా వేర్వేరుగా పరువు నష్టం దావాలను నాగర్‌కోయిల్ సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. కేసు గత విచారణ సమయంలో కోర్టుకు రావాల్సిందేనని విజయధరణికి సమన్లు జారీ అయ్యాయి. బుధవారం పిటిషన్ విచారణకు రాగా, కోర్టుకు హాజరు కావాల్సిన విజయధరణి డుమ్మా కొట్టారు. ఆమె సహాయకుడిగా పేర్కొంటూ, రాజగోపాల్ అనే వ్యక్తి కోర్టుకు ఓ వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు విధుల బహిష్కరణ సాగిస్తున్న దృష్ట్యా, విజయధరణి తరఫున కోర్టుకు హాజరయ్యేందుకు న్యాయవాదులు లేరని, ఈ ద1ష్ట్యా, పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కోరారు.
ఇందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది జ్ఞానశేఖరన్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. కుంటి సాకులతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని, విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా, న్యాయవాదుల విధుల బహిష్కరణను తమకు అనుకూలంగా వాడుకునే పనిలో పడ్డారని వాదన విన్పించారు. కోర్టు విచారణకు డుమ్మా కొట్టిన విజయధరణిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. చివరకు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శశికుమార్ స్పందిస్తూ విజయధరణి తరఫున రాజగోపాల్ సమర్పించిన విజ్ఞాపనను తిరస్కరించారు.
విజయధరణిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశిస్తూ పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ వర్గాలు విస్మయంలో పడ్డాయి. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండడం, కాంగ్రెస్ విప్‌గా ఆమె సభలో తప్పనిసరి. ఈ సమయంలో అరెస్టు వారెంట్ జారీ చేసి ఉన్న దృష్ట్యా, గురువారం ఆమె కోర్టుకు పరుగులు తీసేనా లేదా, అసెంబ్లీకి హాజరయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే.