డీఎండీకేలో ‘జెండా’ పండుగ
Published Thu, Feb 13 2014 12:43 AM | Last Updated on Tue, Oct 2 2018 7:21 PM
సాక్షి, చెన్నై:డీఎండీకే వర్గాలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నాయి. వాడ వాడలా పార్టీ పతాకాన్ని ఎగురు వేశారు. పేదలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. సినీ నటుడిగా ఉన్న సమయంలో తన అభిమాన సంఘాలను, సంక్షేమ సంఘాలుగా విజయకాంత్ మార్చారు. ఆ సమయంలో తన సంక్షేమ సంఘానికి చిహ్నంగా ఓ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత డీఎండీకే ఆవిర్భావంతో అదే చిహ్నం పార్టీ పతాకంగా మారింది. అప్పటి నుంచి పార్టీ పతాకావిష్కరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 12వతేదీ జరుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ పతాకం ఆవిష్కరించి పదిహేను ఏళ్లు అవుతోంది. దీంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడు లేని రీతిలో ఈ పర్యాయం కోలాహలంగా పతాకావిష్కరణ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ఉదయం చెన్నైలోని తన ఇంటి వద్ద పార్టీ పతాకాన్ని ప్రేమలత విజయకాంత్ ఎగుర వేశారు. అక్కడి నాయకులు, కార్యకర్తలతో కలసి అందరికీ ప్రేమలత స్వీట్లు, చాక్లెట్లను పంచి పెట్టారు. పేదలకు చీరలు అందజేశారు.
కోయంబేడులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆవరణలో జెండాను కోశాధికారి ఇళంగోవన్ ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్థసారథి, చంద్రకుమార్, మురుగేషన్, యువజన నేత ఎల్‌కే సుదీష్ పాల్గొన్నారు. అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. పేదలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో వాడవాడలా ఆ పార్టీ శ్రేణులు పతాకాల్ని ఎగుర వేసి పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో జిల్లాకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రత్యేక ప్రతినిధులుగా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. డీఎండీకే యువజన నేత సుదీష్ చెన్నైలో పలు చోట్ల జరిగిన వేడుకకు హాజరై పార్టీ పతాకాన్ని ఎగుర వేశారు. అదే సమయంలో ఏఏ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వేడుకలు జరిగాయోనని ప్రతినిధులు ఆరాతీయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులతో చివరి రోజు ఇంటర్వ్యూల్లో బిజీగా ఉండటంతో జెండా పండుగకు విజయకాంత్ దూరంగా ఉన్నారు.
Advertisement
Advertisement