ఎంపిక కొలిక్కి..
సాక్షి, చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌ల నియోజకవర్గాల ఎంపిక కొలిక్కి వచ్చింది. స్నేహపూర్వకంగా నియోజకవర్గాల ఎంపిక ముగియడంతో గురువారం ఆ వివరాల్ని ప్రకటించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నిర్ణయించారు. డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం కొలిక్కి రావడంతో నియోజకవర్గాల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తమకుకావాల్సిన నియోజకవర్గాల్ని సాధించుకుంది.కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు తమకు మద్దతు దారులకు పలాన నియోజకవర్గం అంటే, పలాన నియోజకవర్గం కావాలని ప్రత్యేక కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
వారు ఇచ్చిన జాబితాతో బుధవారం సాయంత్రం డిఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని కమిటీ అడుగు పెట్టింది. అక్కడ డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కమిటీతో గంటన్నరకు పైగా సమాలోచించింది. రెండు కమిటీలు స్నేహ పూర్వకంగా నియోజకవర్గాల ఎంపికను పూర్తి చేశాయి. తమకు కావాల్సిన స్థానాల్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని సాధించుకుంది. అయితే, కొన్ని స్థానాల విషయంగా మాత్రం డీఎంకే మెట్టు దిగనట్టు, వాటికి బదులుగా ప్రత్యామ్నాయ స్థానాల్ని స్టాలిన్ అప్పగించి ఉన్నారు. నియోజకవర్గాల ఎంపిక ముగిసినానంతరం వెలుపలకు వచ్చిన ఈవీకేఎస్ ఇళంగోవన్, ఆయా నియోజకవర్గాల వివరాల్ని గురువారం ప్రకటిస్తామని ముందుకు సాగారు.