భయం ఎందుకో!
ముల్లై వేందన్‌ను శాశ్వతంగా తొలగించిన వాళ్లు...కేపీ రామలింగం విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో? అని డీఎంకే అధిష్టానాన్ని ఆ పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరి ప్రశ్నించారు. కేపీ రామలింగం అంటే అంత భయం ఎందుకో అని ఎద్దేవా చేశారు. ఇక, తనకు బానిస బతుకు నుంచి విముక్తి లభించినట్టుందని ముల్లై వేందన్ పేర్కొన్నారు.
సాక్షి, చెన్నై : డీఎంకే నుంచి మాజీ మంత్రి, ధర్మపురి నేత ముల్లై వేందన్‌ను శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. అళగిరి మద్దతుదారుడైన ముల్లై వేందన్‌ను తొలగించి, మరో మద్దతుదారుడు కేపీ రామలింగం విషయంలో డీఎంకే అధిష్టానం వెనకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ ఆదివారం అళగిరి మీడియాతో మాట్లాడారు.
కేపీ అంటే భయమా
ముల్లై వేందన్ చేసిన వ్యాఖ్యల్నే కేపి రామలింగం కూడా చేశారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ముల్లై వేందన్‌ను మాత్రం పార్టీ నుంచి ఎందుకు శాశ్వతంగా తొలగించాల్సి వచ్చిందోనని ప్రశ్నించారు. ముల్లై వేందన్‌ను తొలగించిన వాళ్లకు కేపీ రామలింగం విషయంలో భయం ఎందుకో అని ఎద్దేవా చేశారు. ఆయన ఎంపీగా ఉన్న దృష్ట్యా, ఎక్కడ పార్టీ ఇరకాటంలో పడుతుందోనన్న బెంగతోనే ఆయనపై చర్య తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. ముల్లై వేందన్‌కు ఓ న్యాయం కేపీ రామలింగంకు మరో న్యాయయా? అన్ని ప్రశ్నించారు. కేపీని పార్టీ నుంచి సాగనంపిన పక్షంలో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయం డీఎంకేను వెంటాడుతోందని, అందుకే భయ పడుతున్నారని హేళన చేశారు. డీఎంకేలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ వర్గాల్నే గందరగోళంలోకి నెట్టి వేశాయని వివరించారు. ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని సంఘనలు చూస్తే, నవ్వా లో, ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు ఏదో ఒక రోజు తప్పకుండా బయటకు వచ్చి తీరుతాయని, అందుకు తగ్గ భారీ మూల్యాన్ని పార్టీ చెల్లించుకోవడం తథ్యమని హెచ్చరించారు.
విముక్తి
బహిష్కృత నేత ముల్లై వేందన్ ధర్మపురిలో మీడియాతో మాట్లాడుతూ, బానిస బతుకు నుంచి తనకు విముక్తి లభించిందన్నారు. పార్టీలో స్టాలిన్ అరాచకాలకు అనేక మంది నాయకులు బలవుతున్నారని మండి పడ్డారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి చమటోడ్చిన వాళ్లను అణగదొక్కడమే లక్ష్యంగా స్టాలిన్ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. తనకు పార్టీలో పదవి ఇచ్చారేగానీ, ఏ నిర్ణయాన్నీ తీసుకోని రీతిలో ఇన్నాళ్లు చేతులు కట్టి పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కలు కత్తిరించి ఎగర మంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితిని, బానిస బతుకును అనుభవించానన్నారు. ఇప్పుడు తనకు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు తాను ఎక్కడికైనా వెళ్లొచ్చని, జిల్లాలో తన సత్తాను చాటుకునే విధంగా ముందుకు దూసుకెళ్లే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. పార్టీ కోసం తాను 14 ఏళ్లుగా చేసిన సేవలను స్టాలిన్ ఐదేళ్లల్లో సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణగిరి జిల్లా తళి పరిసరాల్లో డీఎంకే పతనానికి ప్రధాన కారకుడు స్టాలిన్ అని ఆరోపించారు. తనను శాశ్వతంగా బహిష్కరించి, మరి కొందరికి ఊరట ఇచ్చే క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మిగిలిన వాళ్లపై తప్పుడు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారని, అలాంటప్పుడు ఆ ఫిర్యాదులు చేసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.