దీక్ష వాయిదా
చెన్నై : జల్లికట్టుకు అనుమతి నినాదంతో చేపట్టదలచిన మహానిరసన దీక్షను డీఎంకే వాయిదా వేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పేర్కొన్నారు. ఇంటింటికీ డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్‌ల చిత్రాలతో కూడిన క్యాలెండర్లను పంపిణీ చేయడానికి డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న మదురై జిల్లా అలంగానల్లూరు వేదికగా మహా నిరసన దీక్షకు డీఎంకే పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.
జల్లికట్టు అనుమతి నినాదాన్ని తొలుత చేతిలోకి తీసుకున్న డీఎంకేకు మద్దతు వెల్లువెత్తిందని చెప్పవచ్చు. దీంతో మహా నిరసన తేదీని అధినేత కరుణానిధి ప్రకటించారో లేదో, జల్లికట్లుకు అనుకూలంగా అన్ని పార్టీలు గళం విప్పడం మొదలెట్టాయి. ఈ పరిస్థితుల్లో జల్లికట్టుకు అనుకూలంగా రాష్ర్ట ప్రభుత్వం స్పందించింది. కేంద్రం సైతం అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేసింది.
ఈ సమయంలో తాము చేపట్ట దలచిన మహా నిరసనను వాయిదా వేసుకుంటున్నామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో సర్వత్రా డీఎంకే వైపుగా దృష్టి మళ్లిందని చెప్పవచ్చు. నిరసనకు పిలుపు నిచ్చి, ఇప్పుడు వాయిదా వేసుకోవడం ఏమిటో అని పెదవి విప్పే వాళ్లు పెరిగారు. అయితే, వాయిదాకు గల కారణాలను డీఎంకే అధినేత కరుణానిధి వివరించడంతో, ఈ సారి జల్లికట్టుకు అనుమతి దక్కుతుందన్న నమ్మకం బయలు దేరింది.
దీక్ష వాయిదా : జల్లికట్టుకు అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌కు ఇది వరకు తాను లేఖ రాసినట్టు కరుణానిధి గుర్తు చేశారు. ఆ లేఖకు సమాధానం ఇస్తూ పొన్‌రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు జల్లికట్టుకు అనుమతి తప్పకుండా దక్కుతుందన్న నమ్మకాన్ని పెంచాయని వివరించారు. జల్లికట్టుకు ఈ సారి ఎలాగైనా అనుమతి ఇచ్చే విధంగా కేంద్రం ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. తప్పకుండా అనుమతి వచ్చి తీరుతుందన్న నమ్మకం తనకు ఉందని పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించి ఉన్నారని పేర్కొన్నారు.
బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి ఇచ్చిన హామీతో తనకు నమ్మకం కుదిరిందని, ఇదే నమ్మకాన్ని అందరం ఉంచుదామని, జల్లికట్టుతో సంక్రాంతిని జరుపుకునే అవకాశం కల్గుతుందన్న నమ్మకం తనకు ఏర్పడి ఉందన్నారు. అందుకే దీక్షను వాయిదా వేసి ఉన్నామని ఒక ప్రకటన ద్వారా కరుణానిధి పేర్కొన్నారు.
ఎంపీల వరద సాయం రూ.కోటి : డీఎంకే రాజ్య సభ సభ్యులు రూ. కోటి వరద సాయంగా ప్రకటించారని మరో ప్రకటనలో కరుణానిధి పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పునరద్ధరణ పనులు చేపట్టేందుకు రూ. 50 లక్షలు, బాధితుల్ని ఆదుకునేందుకు మరో 50 లక్షలు చొప్పున రాజ్య సభ సభ్యులు కేటాయించారని తెలిపారు.
ఇంటింటికీ క్యాలెండర్లు : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎన్నికల కసరత్తుల్లో భాగంగా ఇంటింటికీ క్యాలెండర్ల పంపిణీకి డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందుకు తగ్గ ఆదేశాలు ఆయా జిల్లాల నేతలకు జారీ చేసినట్టు సమాచారం. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, దళపతి ఎంకే స్టాలిన్ ఫొటోలతో పాటుగా, డీఎంకే సందేశాలను వివరించే రీతిలో ఈ క్యాలెండర్లను తీర్చిదిద్ది, ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఆ పార్టీ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి.