డీఎంకే, కాంగ్రెస్‌ల బంధం మళ్లీ చిగురించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్టీల అధినేతలు మళ్లీ దగ్గరవుతుండడంతో రెండు పార్టీల శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ కూటమికి వస్తుందన్న ధీమాను డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి, చెన్నై : కేంద్రంలో యూపీఏ డీఎంకే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో ఈ బంధం కొనసాగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యధిక శాతం మంది కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. డీఎంకే హవాకు కేంద్రంలో హద్దేలేదని చెప్పవచ్చు. తమ బంధం గట్టిదని ఇరు పార్టీల నాయకులు జబ్బలు చరిచి మరీ చెప్పుకున్నారు. అయితే 2జీ స్పెక్ట్రమ్ బండారం వెలుగులోకి రావడం, డీఎంకే మంత్రులు కేసుల్లో ఇరుక్కోవడంతో వీరి బంధం పటాపంచెలయ్యే పరిస్థితులు బయలు దేరాయి. ఈ కేసులు ఓ సాకుగా ఉన్నా, ఈలం తమిళులకు అండగా యూపీఏ సర్కారు ఐక్యరాజ్య సమితిలో నిలవలేదన్న సాకును చూపిస్తూ ఆ కూటమి నుంచి డీఎంకే అధినేత ఎం కరుణానిధి వైదొలిగారు. తదనంతరం కాంగ్రెస్, డీఎంకేలు ప్రత్యర్థులుగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలో దిగిన ఈ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.
వీడని బంధం: డిపాజిట్లు గల్లంతు కావడంతో గుణపాఠం నేర్చిన ఇరు పార్టీల వర్గాలు విడివిడిగా ఉండిసాధించడం కన్నా, ఒక గొడుగు నీడన పయనించడం ద్వారానే లాభం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు అద్దంపట్టే రీతిలో పొగడ్తల పన్నీరు రాష్ట్ర పార్టీ వర్గాల్లో సాగుతూ వస్తున్నాయి. ఇక, డీఎంకే అంటే గిట్టని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఇటీవల తన ధోరణి మార్చుకున్నట్టున్నారు. గతంలో పలు మార్లు రాష్ట్రానికి వచ్చిన రాహుల్, మర్యాద, మాట వరసకైనా డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన సందర్భాలు లేవు. ఈ పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి రాబోతున్న రాహుల్ కరుణానిధిని కలుసుకునేందుకు వ్యూహ రచనచేసి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, కరుణానిధి జన్మదినాన్ని పురస్కరించుకుని తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్టు సంకేతాలు ఉన్నాయి.
ఇక, కరుణానిధి ఇంటి శుభాకార్య వేడుకకు సైతం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుభాకాంక్షల లేఖపంపించడం విశేషం. అదే సమయంలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యే విధంగా కరుణానిధి అడుగులు వేసే పనిలో పడ్డారు. రాష్ట్రంలోని ఆ పార్టీ వర్గాల్ని అక్కున చేర్చుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ఇంట ఏదేని కార్యక్రమం జరిగితే, అందుకు డీఎంకే వర్గాలను పంపిస్తున్నారు. సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన కార్యక్రమాలకు సైతం డీఎంకే వర్గాలు హాజరవుతుండడం గమనించాల్సిన విషయం. ఇక, రాహుల్ గాంధీ శుక్రవారం తన బర్తడేను జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరుణానిధి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి ఉండడం, అందుకు రాహుల్ పలు మార్లు కృతజ్ఞతలు తెలిపినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తెలిపిన శుభాకాంక్షలుకు రాహుల్ కృతజ్ఞతులు తెలిపండంతో ఇరు పార్టీల మధ్య మళ్లీ బంధం చిగురించబోతుందన్న ప్రచారం బయలు దేరింది.
డీఎంకేతో బంధం అన్నది అటు కాంగ్రెస్ వర్గాలకూ ఆనందమే. అదే సమయంలో ఇటీవల మళ్లీ పురుడు పోసుకున్న జీకే వాసన్ నేతృత్వంలో టీఎంసీ అన్నాడీఎంకే పక్షాన నిలబడని పక్షంలో, ఆ బలాన్ని సరి చేసుకునేందుకు వీలుగానే కాంగ్రెస్‌ను అక్కన చేర్చుకునే పనిలో కరుణానిధి పడ్డట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఈ సారి అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధి రానున్న ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేసి తీరుతారన్న ధీమాను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
మళ్లీ బంధం!
Published Sun, Jun 21 2015 3:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement