
70 ఏళ్ల బామ్మకు ఓపెన్‌హార్ట్ సర్జరీ
న్యూఢిల్లీ: ముదిమి వయసు మీదపడింది... అప్పటికే ఓ కిడ్నీని సోదరుడికి దానం చేసింది. గతంలో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న చరిత్ర కూడా ఉంది. ఇన్ని సమస్యలున్న వ్యక్తికి గుండెపోటు వస్తే.... ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తే... వైద్యులుసైతం వెనకడుగు వేయడం ఖాయం. కానీ ఓ బామ్మ విషయంలో నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఆసుపత్రి వైద్యులు ధైర్యంగా వ్యవహరించారు. 70 సంవత్సరాల వయసులోనే ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకెళ్తే... ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన నిర్మల అనే వృద్ధురాలి గుండెలో సమస్య తలెత్తింది. హృదయం నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కుంచించుకుపోవడంతో దాని ప్రభావం గుండెపై పడసాగింది. ఈ కారణంగా గత ఆరునెలలుగా శ్వాస తీసుకోవడంతో కూడా ఆమె తీవ్రమైన ఇబ్బంది పడుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఆమె ప్రాణాలకే ముప్పని తెలియడంతో నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమస్యను గుర్తించిన వైద్యులు ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాలని నిర్ణయించారు.
అయితే అప్పటికే ఆమెకు రొమ్ము క్యాన్సర్ సోకడంతో కుడి రొమ్మును తొలగించారని, రేడియేషన్, కీమోథెరపీ వంటి తీవ్రమైన చికిత్సలు కూడా చేయించుకుందని తెలియడంతో ైవె ద్యులు కొంత సంకోచించారు. పైగా సోదరుడికి ఓ మూత్రపిండాన్ని ఇచ్చి, ఒకే మూత్రపిండంతో బతుకుతోంది. ఇన్ని సమస్యలున్న ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయొచ్చా? అని మల్లగుల్లాలు పడ్డారు. గత్యంతరం లేకపోవడం, కుటుంబ సభ్యులు కూడా సర్జరీ చేయాలని ఒత్తిడి తేవడంతో ఎస్‌ఎన్ ఖన్నా నేతృత్వంలోని బృందం సర్జరీకి సమాయత్తమైంది. హృదయం నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకున్నారు. సమస్య ఉన్న రక్తనాళాన్ని తొలగించి, మరోదానిని అమర్చారు. ఈ విషయమై వైద్య బృందానికి నేతృత్వం వహించిన ఖన్నా మాట్లాడుతూ... ‘అప్పటికే అనేక సమస్యలతో బాధపడుతున్న నిర్మలకు తప్పనిసరిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. వయసు మీద పడడంతో కొంత సంశయించినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాం. సర్జరీ తర్వాత కూడా ఆమె వేగంగా కోలుకుంటోంద’న్నారు.