ఎయిమ్స్‌లో హార్ట్ సర్జరీ కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య 4000
Published Tue, Oct 1 2013 2:25 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
సాక్షి, న్యూఢిల్లీ: హార్ట్ ఎటాక్... ఇది దాడి చేసిన క్షణాల్లో వైద్యం అందకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. అంతటి అత్యవసర వైద్యం అవసరమైన నాలుగు వేల మంది ఎయిమ్స్‌లో హార్ట్ సర్జరీ కోసం ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఈ మహమ్మారి దాడి చేయడంతో మృత్యువు గడపవద్దకు వెళ్లి.. ఎయిమ్స్‌కు తిరిగొచ్చిన వీరు ఆ మహమ్మారి మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక గుప్పెడంత గుండెను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమవంతు ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురుచూస్తున్నారు. సరిపడా వైద్యసదుపాయాలు లేకపోవడంతో ఎయిమ్స్‌లో హృద్రోగుల దుస్థితి ఎంతో దయనీయంగా మారింది. ఎయిమ్స్‌లో ప్రస్తుతం హార్ట్ సర్జరీ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య నాలుగు వేలకు చేరిందని ఆర్‌టీఐ కింద వేసిన ఓ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చింది.
ఇందులో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇదే పరిస్థితి ఢిల్లీలోని మిగిలిన సర్కార్ ఆసుపత్రుల్లోనూ ఉంది. దేశంలోనే అత్యంత పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్ వర్గాలు ఆర్‌టీఐకి జవాబిస్తూ ‘రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని’పేర్కొన్నాయి. రోగి పరిస్థితి ఆధారంగా వెయిటింగ్ లిస్టులో చేరుస్తున్నట్టు చెబుతున్నారు. అత్యవసరమైన వారికి జాబితాలో నాలుగు నెలల తర్వాత సర్జరీ ఉన్నా ఒక నెలకు మారుస్తున్నారు. కాస్త ఫర్వాలేదనుకన్నవారికి ఏడాది వరకు ఆపుతున్నట్టు పేర్కొన్నారు. ఎయిమ్స్ సీనియర్ హార్ట్ సర్జన్ తెలిపిన ప్రకారం.. రోగుల సంఖ్య ఇంత ఎక్కువ ఉంటే మేం ఏం చేయలేమని ఆయన తెలిపారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ హార్ట్ సర్జరీ చేస్తున్నా, ప్రజలకు ఎయిమ్స్ వైద్యులపైనే నమ్మకం ఎక్కువ ఉంటోందన్నారు.
ఇతర ఆసుపత్రుల్లో ఉచితంగా హార్ట్ సర్జరీలు చేస్తున్నారని, ఎయిమ్స్‌లో ఇదే సర్జరీకి లక్షన్నర రూపాయల వరకు ఖర్చవుతున్నా రోగుల సంఖ్య తగ్గడం లేదని వారు తెలిపారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని ఎనిమిది ఆపరేషన్ థియేటర్లలో సర్జరీలు చేస్తున్నారు. మరోవైపు ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో 52 మంది హార్ట్ పేషంట్లు సర్జరీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 14 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం నలుగురు హార్ట్ సర్జన్లు పనిచేస్తున్నారు. ఒక్కో రోగికి సర్జరీకి నెల వరకు పడుతోంది. జూలై 20 వ రకు ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇక్కడ చేర్చవచ్చని పేర్కొంటున్నారు. ఆర్‌ఎంఎల్‌లోనూ నిపుణులైన సిబ్బందితోపాటు అత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్నట్టు వారు చెబుతున్నారు.
హైదర్‌పురాలో 500 పడకల ఆసుపత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ ఎంసీడీ పరిధిలోని హైదర్‌పురాలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సోమవారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర పడింది. హైదర్ పురా వార్డు నంబర్ 54-55లో దీన్ని నిర్మించనున్నారు. రోహిణి వాసులకు అందుబాటులోకి రానున్న ఈ ఆసుపత్రికోసం ఇప్పటికే ఏడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ రామ్ సంఘల్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ ఎంసీడీ పరిధిలో ఇప్పటికే ఐదు ఆసుపత్రులున్నాయన్నారు. కానీ స్థానికుల అవసరాల మేరకు మరో పెద్ద ఆసుపత్రి రోహిణిలో నిర్మిచాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రతిపాదన ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోందన్నారు. మొత్తం 13 అంతస్తుల్లో ఆసుపత్రి భవనం నిర్మించనున్నామని చెప్పారు. దీనిలో బేస్‌మెంట్ పార్కింగ్ అందుబాటులో ఉంటుందని, ఆసుపత్రి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దీనిలో అల్లోపతితోపాటు హోమియోపతి, ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
Advertisement
Advertisement