బెంగళూరులో వీధి కుక్కల్ని పడుతున్న పాలికె సిబ్బంది. ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే చేపడుతున్నారు
అరిచే కుక్క కరవదనే సామెతకు కాలం చెల్లిందా?, రాష్ట్రంలో కుక్క కాటు కేసులు విచ్చలవిడిగా పెరుగుతుండడమే దీనికికారణం. వీధి కుక్కలదే ఇందులో ఎక్కువ పాపముంది.దీంతో ఎంతోమంది రేబీస్ వైరస్ బారినపడి ప్రాణాలుకోల్పోతున్నారు. వీధి కుక్కల నియంత్రణ అనేది కాగితాలకే పరిమితమైంది.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాట్లు పెరిగిపోతున్నాయి. అయితే వాటి కి అనుగుణంగా ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్‌వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) కొరతగా ఉండటంతో గత మూడేళ్ల కాల వ్యవధిలో సుమారు 60 మంది కుక్కకాటుకు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా 1.5 లక్షల ఏఆర్‌వీ యూనిట్ల అవసరం ఉంది. అయితే 1.2 లక్షల ఏఆర్‌వీ మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఆర్‌వీ యూనిట్లు కొరతగా ఉన్నట్లు కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ పంకజ్‌కుమార్‌పాండే తెలిపారు.
వేసవిలో రెచ్చిపోతున్న శునకాలు
అయితే ఇటీవల కాలంలో ఎండలు మండిపోవడంతో కుక్కలు అనవసరంగా జనాలపైకి వస్తున్నట్లు భావిస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలను కరుస్తున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల ద్విచక్ర వాహనదారుదల వెంటబడి కరుస్తున్నాయి. రాత్రి వేళల్లో కుక్కలన్నీ గుంపుగా చేరి అటు ఇటు తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. వీధి కుక్కలను అదుపులోకి తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా.. ఆచరణలోకి రాలేదు.
జాతీయ సమస్యగా గుర్తించాలి
ప్రతి ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. ఇది రాష్ట్ర సమస్య కాదు. జాతీయ సమస్యగా గుర్తించాలి. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా రేబిస్ వ్యాక్సిన్‌ను ‘యూనివర్సల్ ఇమ్యునైనేషన్ ప్రోగ్రామ్’లో భాగం చేయాలి. ఔషధ తయారీ కంపెనీలు రాష్ట్రప్రభుత్వాలకు స్పందించవు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖలో భాగంగా డ్రగ్స్ కంపెనీలకు అటాచ్ చేయాలి. ఈమేరకు తయారీ కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తే బాగుంటుందని అసోసియేషన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ రేబిస్ ఇన్ ఇండియా (ఏపీసీఆర్‌ఐ) ఉన్నతాధికారి ఎంకే సుదర్శన్ తెలిపారు.
రేబీస్ కొరతపై ఏమంటున్నారు
ఏఆర్‌వీ సరఫరాలో ఫార్మా కంపెనీల నుంచి సరైన సమాధానం రాలేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య ఒక్క కర్ణాటకకే కాదని.. మిగతా రాష్ట్రాల్లో కూడా నెలకొందని కర్ణాటక రాష్ట్ర డ్రగ్స్ లాజిస్టిక్స్ అదనపు డైరెక్టర్ నాగరాజు తెలిపారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు తగిన మేరకు మెడిసిన్ పంపుతున్నామన్నారు. కానీ ఆరోగ్య రక్షసమితి, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర పథకాలకు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరత ఏర్పడుతోందని పేర్కొన్నారు. కుక్కకాటుకు గురైన వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేస్తే కనీసం 14 – 15 రోజులు నియంత్రించవచ్చు. అయితే తగినంత స్టాక్ లేక ప్రాణాల మీదకు వస్తోంది.
బళ్లారి, యాదగిరి, హావేరిలో అధికం
♦ రాష్ట్రవ్యాప్తంగా 2016– 2018 మధ్యకాలంలో 789 కుక్కకాటు కేసులు నమోదు అయినట్లు కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నివేదికల ద్వారా తెలుస్తోంది.
♦ 2016లో 22, 2017లో 15, 2018లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
♦ రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే యాదగిరి, బళ్లారి, హావేరిలోనే అత్యధికంగా రేబిస్ కేసులు కనిపిస్తున్నాయి.
♦ 2017లో యాదగిరిలో 175, బళ్లారిలో 86, హావేరిలో 170 రేబిస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment