న్యూఢిల్లీ: డ్రైవింగ్ లెసైన్స్ పొందడమంటే కొందరికి గగనమైతే మరికొందరికి ఎడమ చేతి ఆట. కన్సల్టెంట్ల పేరుతో కాచుకొని ఉండే బ్రోకరుకు అడిగినంత చెల్లిస్తే మీరు అండమాన్‌లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా లెసైన్స్ వచ్చి చేరుతుందనే వాళ్లు.
డ్రైవింగ్ లెసైన్స్ పొందడం ఆషామాషీ కాదు
Published Thu, Oct 17 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లెసైన్స్ పొందడమంటే కొందరికి గగనమైతే మరికొందరికి ఎడమ చేతి ఆట. కన్సల్టెంట్ల పేరుతో కాచుకొని ఉండే బ్రోకరుకు అడిగినంత చెల్లిస్తే మీరు అండమాన్‌లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా లెసైన్స్ వచ్చి చేరుతుందనే వాళ్లు. ఇప్పుడు ఆ రోజులు పోయాయంటున్నారు అధికారులు. ఇప్పుడిది పిల్లలాట ఇంకెంత మాత్రం కాదంటున్నారు రవాణాశాఖ అధికారులు. ఇప్పుడు డ్రైవింగ్ పరీక్ష జరిగేటప్పుడు ఆర్టీఓ అధికారి మీ పక్కనే కూర్చొని పరీక్ష నిర్వహిస్తాడు. గత నెలలో డ్రైవింగ్ లెసైన్స్ జారీ చేసే విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత డ్రైవింగ్ లెసైన్స్‌లు పొందేవారి సంఖ్య 50 శాతానికి పడిపోయిందని అంటున్నారు. సెప్టెంబర్ నెలలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు కేవలం 19,517 లెసైన్స్‌లు మాత్రమే మంజూరీ చేసిందని తెలిపారు.
గతంలో నిబంధనలు లేవా అని ఓ అధికారిని ప్రశ్నించగా ‘‘ఇప్పుడు రోజుకు నియమిత సంఖ్యలోనే దరఖాస్తులు పరిశీలిస్తున్నాము. ప్రమాణ పరీక్షలు అన్నీ పూర్తయిన తరువాత మాత్రమే లెసైన్స్‌లు మంజూరు చేస్తున్నాము. అభ్యర్థి వాహనం నడిపేటప్పుడు లెసైన్స్ జారీ చేసే అధికారి పక్కనే కూర్చుని పరిశీలిస్తాడు’’ అని వివరించారు. ‘‘దరఖాస్తుల సంఖ్య తగ్గి పని ఒత్తిడి తగ్గినప్పుడు కేంద్రీకరణ పెరుగుతుంది. అభ్యర్థి నైపుణ్యాన్ని పరిశీలించేందుకు అధికారులకు కావాల్సినంత సమయం లభిస్తుంది. నైపుణ్యం కలిగిన అభ్యర్థికే లెసైన్స్ ఇవ్వడం వలన రోడ ్ల మీద ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుంది’’ అని వివరించారు.
అయితే అభ్యర్థికి లెసైన్స్ జారీ చేసే ముందు పరీక్షించే అధికారి పక్కనే ఉండాలనేది పాత నిబంధనే కదా అని ప్రశ్నిస్తే మాత్రం ఆయన ‘నో కామెంట్’ అంటూ మౌనముద్రలోకి వెళ్లిపోయాడు. షేక్‌సరాయి ఆర్‌టీఓ పరిధిలో జూలైలో 5,769 లెసైన్స్‌లు జారీ చేశారు. ఆగస్టులో 2,010 మాత్రమే మంజూరయ్యాయి. వసంత్ విహార్ కార్యాలయం పరిధిలో ఈ సంఖ్య 639 మాత్రమే. కాగా ఇప్పటి వరకు లెసైన్స్‌లు తీసుకున్నవారు మాత్రం దీనికి భిన్నమైన కథనాలు వివరించారు. ‘‘నేను డ్రైవింగ్ లెసైన్స్ పొందడానికి ఎలాంటి పరీక్ష రాయలేదు. డ్రైవింగ్ స్కూల్ వారికి ఫీజు రూపంలో చెల్లించిన తరువాత వారే లెసైన్స్ తెచ్చి ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లెసైన్స్ పొందాను. కేవలం అవసరమైన దస్తావేజులు మాత్రం సమర్పిం చాను’’ అని వివరించారు పరూల్ సూరజ్.
అరిందమ్ జాయ్ ఆశ్చర్యం కలిగించే విషయం తెలిపాడు. ‘‘నేను డ్రైవింగ్ పరీక్షకు వెళ్లినప్పుడు నా వద్దకు ఏ అధికారి రాలేదు. నాకు మోటార్ సైకిల్ నడపడం మాత్రమే చేతనవును. అయితే నాలుగు చక్రాల వాహనానికి కూడా లెసైన్స్ కోరుతూ దరఖాస్తు జారీ చేశాను. ఎలాంటి పరీక్ష లేకుండానే రెండింటికి లెసైన్స్ దొరికింది. నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా వాటి అమలు అంతే ఖచ్చితంగా జరగాలి కదా?’’ అని కఠోర సత్యాన్ని తెలిపాడు.
Advertisement
Advertisement