ఎండిపోయిన ‘ఖరీఫ్’
♦ 11 లక్షల హెక్టార్లలో పంట నష్టం
♦ 2014 కన్నా దారుణమైన పరిస్థితి
♦ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
సాక్షి, ముంబై : రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంట పూర్తిగా ఎండిపోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో లక్షల హెక్టార్ల పంట నాశనమైంది. జొన్నలు, సజ్జలు, పెసర్లు, మొక్కజొన్న, మినుమలు లాంటి పంటలు 70 శాతం ఎండిపోయాయి. జూన్ నెలలో వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల హెక్టార్లలో రైతులు విత్తనాలు నాటారు. అయితే వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. 2014 కంటే కూడా ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు అంటున్నారు. తిరిగి ఖరీఫ్ పంట వేయాలన్నా పరిస్థితులు అనుకూలించలేదని పేర్కొన్నారు.
పంట దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 144 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంట సాగు చేస్తారని, అయితే ఇప్పటివరకు 123 లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటగా వర్షాభావ పరిస్థితుల వల్ల 11 లక్షల హెక్టార్ల పంట నాశనమైందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మినుములు, పెసర్లు, సోయాబీన్, సజ్జలు పప్పు ధాన్యాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు అంటున్నారు. పెసర్లు, సోయాబీస్ అధికంగా పండించే మరాఠ్వాడా ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుంది. రబీ సీజన్ సమీపిస్తుండటంతో పాడైపోయిన పంటల స్థానంలో తిరిగి విత్తనాలు వేసినా లాభం ఉండదని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు పుణే జిల్లాలోని ఇందాపూర్, బారామతి, శిరూర్, దౌండ్‌లలో పంటలు ఎండిపోయాయని, నాసిక్, జల్గావ్, షోలాపూర్, సాంగ్లీ, అహ్మద్‌నగర్‌లలో పరిస్థితి మరింతగా దారుణంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పుణే జిల్లాలో 1.60 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంట ఎండిపోయిందని, అధికమొత్తంలో పంట పనికి రాకుండా పోయిందని చెబుతున్నారు. పుంధర్, బారామతి, ఇందాపూర్, దౌండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల నుంచి వర్షాలు కురవలేదని, దీంతో 15 వేల హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.