సీసీఐ తీరుతో రైతుల బేజారు | Farmers suffering with CCI way | Sakshi
Sakshi News home page

సీసీఐ తీరుతో రైతుల బేజారు

Published Thu, Nov 5 2015 2:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

సీసీఐ తీరుతో రైతుల బేజారు - Sakshi

సీసీఐ తీరుతో రైతుల బేజారు

♦ పత్తి కొనుగోళ్లలో మడత పేచీలు
♦ సీసీఐ ఇప్పటివరకు సేకరించిన పత్తి 38వేల క్వింటాళ్లు మాత్రమే
♦ లావాదేవీల్లో ప్రైవేటు వ్యాపారులదే పైచేయి
♦ సవాలక్ష సాకులను చూపుతున్న అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మీనమేషాలు లెక్కిస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), రైతుల నుంచి కొనుగోళ్ల విషయంలోనూ చొరవ చూపడం లేదు. నాణ్యత ప్రమాణాల పేరిట సీసీఐ సవాలక్ష నిబంధనలు విధిస్తుండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 84 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన సీసీఐ, ఇప్పటి వరకు 62 చోట్ల కేంద్రాలను ప్రారంభించినట్లు చెపుతోంది. ఇందులో 19 కేంద్రాల్లో లావాదేవీలు చురుగ్గా సాగుతున్నట్లు సీసీఐ వర్గాలు చెప్తున్నా.. ఇప్పటి వరకు 1592 మంది రైతుల నుంచి కేవలం 38 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అత్యంత నాణ్యమైన పత్తికి సీసీఐ క్వింటాలుకు రూ.4,100 చెల్లిస్తుండగా, ప్రైవేటులో రూ.3,800 నుంచి రూ.4,200 వరకు పలుకుతోంది. సీసీఐ ద్వారా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో.. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ఆరంభంలో ధరను కొంత మేర పెంచి, ఆ తర్వాత అమాంతం తగ్గించేస్తున్నారు. తెల్లదోమ తెగులు మూలంగా మహారాష్ట్ర, రాజస్తాన్‌లో పత్తి పంట దెబ్బతినడంతో ప్రైవేటు వ్యాపారులు మన రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు వేగవంతం చేశారు. కూలీల కొరత, తక్షణమే కూలీ డబ్బులు చెల్లించాల్సి రావడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల నేపథ్యంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 సీసీఐ సాకులు...
 రైతులకు దళారీల బెడద తగ్గించేందుకు సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మినహా ప్రభుత్వం వద్ద మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈ ఏడాది రాష్ట్రంలో 16.33 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారు. 27.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 90 సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించింది. అయితే సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ 84 కేంద్రాలే తెరిచేందుకు సీసీఐ అంగీకరించింది. అక్టోబర్ 10 నుంచి 17వ తేదీల మధ్య గుర్తిం చిన వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సీసీఐ ప్రకటించినా నేటికీ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల ప్రారంభమైనా.. కొనుగోలు కేంద్రం నుంచి జిన్నింగ్ మిల్లు వరకు పత్తి రవాణా వ్యయాన్ని రైతులే భరించాలని మడత పేచీ పెడుతున్నారు.

 ప్రభుత్వ వినతి ఫలించేనా..?
 పత్తి కొనుగోలు విషయంలో రైతుల నుంచి వస్తున్న ఒత్తిడితో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేశారు. మద్దతు ధరను క్వింటాలుకు రూ.5వేలు, తేమ శాతం 12 నుంచి 20కి పెంపు, హైదరాబాద్‌లో సీసీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, రవాణా భారాన్ని సీసీఐ భరించడం తదితరాలపై కేంద్రానికి విన్నవించారు. అయితే కేంద్రం నుంచి ఆదేశాలు రానంతవరకు పత్తి కొనుగోలులో ప్రస్తుతమున్న నిబంధనలే పాటిస్తామని సీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement