వివరాలు వెల్లడిస్తున్న నటుడు సతీష్
మండ్య : తాను నటించిన సినిమాల ద్వారా అందుతున్న ఆదాయంలో పది శాతాన్ని రైతుల సంక్షేమానికి వెచ్చించనున్నట్లు శాండిల్‌వుడ్ నటుడు నీనాసం సతీష్ తెలిపారు. మంగళవారం మండ్యలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాను నటించిన రాకెట్ సినిమాలో వచ్చే లాభంలో పది శాతాన్ని ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు అందించనున్నట్లు చెప్పారు. ఇకపై తన ఆదాయంలో పది శాతాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని పేర్కొన్నారు.
మండ్య జిల్లాలో నెలకొన్న కరువు కారణంగా పంటలు సక్రమంగా పంటలు పండక, పండిన పంటలు చేతికి రాక, వచ్చినా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమని అన్నారు. ఒక రైతు బిడ్డగా. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, రైతుల కుటుంబంలో ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో తాను అనుభవించానని, అందు కోసమే తనకు వచ్చే లాభంలో 10 శాతాన్ని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇస్తానని అన్నారు. పరభాషా చిత్రాలను కన్నడలోకి డబ్బింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.