అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులపట్ల మహిళల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఇన్నాళ్లూ ఆందోళనలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్లకార్డుల ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగ క్కిన మహిళలు ఓ అడుగు ముందుకేసి నిందితులపై కోడిగుడ్లతో దాడి చేశారు.
సాక్షి, ముంబై: అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులపట్ల మహిళల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఇన్నాళ్లూ ఆందోళనలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్లకార్డుల ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగ క్కిన మహిళలు ఓ అడుగు ముందుకేసి నిందితులపై కోడిగుడ్లతో దాడి చేశారు. వివరాల్లోకెళ్తే... శక్తి మిల్లు కాంపౌండ్‌లో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శుక్రవారం ఖిల్లా కోర్టుకు తీసుకెళ్తున్నట్లు ముందే తెలుసుకున్న ఎన్సీపీ మహిళా విభాగం కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.
నిందితులను తీసుకొని పోలీసులు కోర్టులోనికి వెళ్లే సమయంలో అదనుచూసి ఒక్కసారిగా కోడిగుడ్లను విసిరారు. ఊహించని విధంగా మహిళలు నిరసన తెలపడంతో పోలీసులు కూడా కొంత గందరగోళానికి గురయ్యారు. అంతలోనే తేరుకొని నిందితులను కోర్టులోకి వేగంగా తీసుకెళ్లారు. అత్యాచార కేసుకు సంబంధించి పోలీసుల ఐదుగురిని అరెస్టు చేయగా వీరిలో విజయ్ జాధవ్, సిరాజ్ రెహ్మాన్, ఖాసిం బెంగాలీ, చాంద్‌బాబులకు కోర్టు శుక్రవారం వరకు పోలీస్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. పోలీస్ కస్టడీ ముగియనుండడంతో చాంద్‌బాబు మినహా మిగతా ముగ్గురిని శుక్రవారం పోలీసులు ఉదయం ఖిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులకు కోర్టు పోలీసు కస్టడీని వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించింది.