
అవసాన దశలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు
దొడ్డబళ్లాపురం : అవసాన దశలో ఉన్న దేశంలోని కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు త్వరలో కనుమరుగు కానున్నాయని, ఒక్క బీజేపీనే బలమైన పార్టీగా అవతరించనుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజు గురువారం ఆయన తాలూకాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా దొడ్డబళ్లాపురం తాలూకాలోని కొడళ్లి గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అక్కడక్కడా కనిపిస్తోందని, అందుకే అది మ్యూజియం పార్టీగా మారి పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కనుమరుగు కానుందని అన్నారు. ఆయన యూపీలోని అమేథీ నుంచి గెలిచాడని, అయితే యూపీలో కాంగ్రెస్ గల్లంతయిందని, కావున రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వం వహిస్తే దేశంలో కాంగ్రెస్ గల్లంతవుతుందన్నారు.
భూస్వాధీన చ ట్టం గురించి పార్లమెంట్‌లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరానికనుగుణంగా పలు మార్పులు సవరణలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మంది సభ్యత్వం నమోదు చే యడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టి బీజేపీ అధికారంలోకి రానుం దని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉంటుందన్నారు.కొన్ని పార్టీలు కులాల ప్రాధాన్యంతో, మరి కొన్ని కుటుంబాల ప్రాధాన్యంతో నడుస్తాయని,బీజేపీ మాత్రం సిద్ధాంతాల ప్రాధాన్యంతో నడిచేపార్టీగా చెప్పుకొచ్చా రు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు సం చాలకులు, జెడ్పీ సభ్యుడు హనుమంతేగౌడ, సీనియర్‌నేత కేఎం హనుమంత రా యప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బీసీ నా రాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.