సొరంగం ఉందని వెళ్తే.. సొట్టలే!
తుంటరి ఆలోచనలకు అంతు లేదు. తమకున్న టాలెంటును రకరకాలుగా ఉపయోగించుకుంటారు. మొన్నీమధ్య హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లన్నింటి మీద రకరకాల వాల్ ఆర్టులు వేసి వాటిని అందంగా తీర్చిదిద్దిన విషయం గుర్తుంది కదూ. కానీ.. చెన్నైలో మాత్రం ఓ తుంటరి తనకున్న కళను వేరేవిధంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లై ఓవర్ గోడ మీదే అతడు తన పెయింటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కానీ ఆ నైపుణ్యమే కార్ల పాలిట శాపంలా మారింది.
అచ్చం ఓ సొరంగం ఉన్నట్లుగా ఫ్లై ఓవర్ గోడమీద పెయింట్ చేయడంతో.. నిజంగా టన్నెల్ ఉందేమోనని, అవతలకి వెళ్లాల్సిన వాళ్లంతా చుట్టు తిరిగి వెళ్లక్కర్లేదనుకుని ఆ ఫ్లై ఓవర్ గోడను గుద్దేస్తున్నారు. సొరంగంలోంచి వెళ్తే సమయం ఆదా అవుతుందనుకున్న వాళ్లు.. తమ కార్లకు పట్టిన గతి చూసి, దాని రిపేర్లకు ఎంత మొత్తం వదులుతుందోనని తల పట్టుకుంటున్నారు. ఎవరో ఇడియట్ ఇలా గోడ మీద పెయింటు వేశాడు చూడండి అంటూ.. ఫ్లై ఓవర్ ఫొటోను, పాడైన కారు ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు. మీరు కూడా అటువైపు వెళ్తే.. కాస్తంత జాగ్రత్తగా ఉండండి.