రంగంలోకి సినీ తారలు
విమర్శలకు దిగిన తాజా మాజీ సీఎంలు
బెంగళూరు: పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన తాజా, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆదివారం ప్రచార పర్వంలో దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలకు పాల్పడుతూ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పచార పర్వంలో విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఆయా పార్టీలకు చెందిన సినీతారలు కూడా ఇంటి ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థుల గెలుపుకోసం చమటోడుస్తున్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీతారలను కూడా ప్రచార పర్వంలో భాగస్వామ్యం చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన బహుభాషా నటి కుష్బూ బెంగళూరులో ఆదివారం తమిళనాడు ప్రాంత ప్రజలు ఎక్కువగా నివసించే హలసూరులో ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం ముగిసేంత వరకూ ఆమె బెంగళూరులోనే ఉంటారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బీజేపీలో కూడా సినీ తారలను రంగంలోకి దించింది. స్థానికంగా ఉంటున్న సినీ తార రక్షిత పట్టాభిరామ నగర వార్డులో హెచ్.సీ నాగరత్న తరఫున ప్రచారం నిర్వహించారు. నగరాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే జేడీఎస్ సినీగ్లామర్ విషయంలో వెనుకబడి ఉందని ఆ పార్టీ అభ్యర్థులే పేర్కొంటున్నారు.
రెండేళ్లలోనే రూ.2,500 కోట్లు లూటీ-సీఎం సిద్ధరామయ్య
భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో గార్డెన్ సిటీ గార్బేజ్ సిటీగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బెంగళూరు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను బీబీఎంపీలో అధికారంలో ఉన్న బీజేపీ సక్రమంగా ఖర్చుపెట్టడంలేదు. అనేక అక్రమాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో గత రెండేళ్లలో రూ.2,500 కోట్లు లూటీకి పాల్పడింది. మరోసారి అధికారంలోకి వస్తే ఆ పార్టీ నిధులను పక్కదారి పట్టిస్తుంది. ప్రజల సొమ్ము అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చుకావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలి.
కాంగ్రెస్‌దే లూటీ సంస్కృతి- యడ్యూరప్ప
కాంగ్రెస్ పార్టీదే లూటీ సంస్కృతి. గడిచిన రెండేళ్లలో కర్ణాటకలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బీజేపీని విమర్శించే నైతికత లేదు. బీజేపీ హయాంలోనే మెట్రో వంటి అత్యాధునిక రవాణా వ్యవస్థ పట్టాలెక్కింది. కబ్జాలకు గురైన అనేక చెరువులు తిరిగి వినియోగంలోకి వచ్చాయి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించి బీబీఎంపీ మేయర్ పదవి తిరిగి బీజేపీకి దక్కేలా చేయాలి.
దొందు దొందే- కుమారస్వామి
ప్రజల సొమ్ములను స్వప్రయోజనాలకు వాడుకోవడం లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లది ఒకటే దారి. ఈ రెండు పార్టీల వల్ల అభివృద్ధి, సంక్షేమం విషయంలో బెంగళూరు నగరం తిరోగమన దిశలో ప్రయాణం చే స్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి వచ్చే పె ట్టుబడులు ఆగిపోతాయి. జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే బెంగళూరు నగరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తాం.
వేడెక్కిన ప్రచారం
Published Mon, Aug 17 2015 2:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement