ముంబై: వేసవి కాలం.. అగ్నికి ఆజ్యం పోసే కాలం. ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వింటూనే ఉంటాం. అనుకోకుండా మన దగ్గర ప్రమాదం జరిగితే ఒక్కోసారి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. ఆ అగ్ని ప్రమాదం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది.
కళ్లెదుటే సర్వస్వం బుగ్గి పాలవుతుంటే గుండెలు పగిలే వేదన అనుభవించాల్సి వస్తుంది. అప్పటి వరకు దర్జాగా జీవించిన వారు ప్రమాదం జరిగిన మరుక్షణమే కట్టుబట్టలతో రోడ్డున పడతారు. దిగువ, మధ్య తరగతి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడిపోతారు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఏమీ చేయలేని మనం అవి జరగకుండా మాత్రం ఎన్నైనా చేయగలం. కనీసం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎనలేని ఆస్తులు, ప్రాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలం.
ప్రమాదాలను నివారించే వీలు కూడా ఉంటుంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ప్రమాదాలు దరికి రాకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
ఇంట్లోని వస్తువులు అల్మారాలు, షెల్పుల్లో సక్రమంగా ఉంచండి. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే గుణం ఉన్న వస్తువులు, సామగ్రి అందుబాటులో లేకుండా చూడాలి.
కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పి వేయాలి.
ఇంట్లో ఐఎస్‌ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలు వాడాలి.
పాడైన వైర్లు వాడొద్దు. ఓవర్‌లోడ్ వేయొద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లలో దాని సామర్థ్యానికి మించి ప్లగ్‌లను వాడొద్దు.
పడుకుని పొగ తాగొద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులపై కుటుంబంతో బయటకు వెళ్తే ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి.
టపాకాయలు కాల్చే సమయంలో నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు.
వేసవిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి, నేలరాలిన ఎండుటాకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్చి బయటపడేయాలి.
{పమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
వేసవికాలంలో రాత్రిళ్లు కరెంటు ఎక్కువగా పోతుంది. కరెంటు పోయినప్పుడు క్యాండిళ్లు, కిరోసిన్ దీపాలు వెలిగించి అలాగే నిద్ర పోతుంటాం. అలా కాకుండా పడుకునే ముందు వాటన్నింటిని ఆర్పి వేయాలి. తప్పదనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలి.
{పమాదవశాత్తు నిప్పంటుకుంటే భయంతో పరుగెత్తకూడదు. దుప్పట్లు, తట్టులతో మంటలను కప్పేయాలి. వీలైనంత వరకు నేలపై దొర్లాలి.
పాఠశాలలు, ఆస్పత్రుల్లో..
పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌లో ఆర్‌సీసీ లేదా కాంక్రిట్ స్లాబులనుమాత్రమే పైకప్పులుగా వాడాలి.
ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి.
సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి.
పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునేందుకు సరైన ప్రణాళిక రచించి అది అందరికీ తెలిసే విధంగా తగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లే మార్గాల్లో(మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి.
ఐఎస్‌ఐ మార్కు కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని వాడాలి.
తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పు కలిగిన నిర్మాణాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహించరాదు.
షార్ట్‌సర్క్యూట్ జరిగితే అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అమర్చుకోవాలి.
అగ్ని ప్రమాదం అరికట్టడానికి సరిపడా నీరు, ఫిక్సిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలి.
ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా నిర్వహించాలి.
కర్మాగారాల్లో..
పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల ఉనికిని గుర్తించేలా ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి.
అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. మిషనరీ బెల్టులు, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్క్యూట్‌లో ఓవర్ లోడ్ వేయకూడదు.
మండే స్వభావం ఉన్న దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయాలి.
అగ్ని ప్రమాదం సంభవిస్తే..
{పమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి.
విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగితే నీటిని ఉపయోగించకుండా పొడి ఇసుక లేదా మట్టి వాడాలి.
ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి.
అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పెళ్లి పందిళ్లు, ఇతర పందిళ్లు వేయాలి.
పందిళ్ల చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ స్థలాన్ని ఉంచాలి.
ఎలక్ట్రికల్ లైవ్ వైర్లు, పెండాల్స్‌కు కనీసం రెండు మీటర్ల దూరం ఉంచాలి.
వంటింట్లో..
వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.
గ్యాస్ సిలిండర్ ట్యూబ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మార్చాలి. నాణ్యమైన ట్యూబ్‌లనే వాడాలి.
గ్యాస్ స్టౌ ఎత్తయిన ఫ్లాట్‌ఫాంపై ఉండేలా చూసుకోవాలి.
వంట గ్యాస్ వాడకం పూర్తి కాగానే రెగ్యులేటర్ వాల్వ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి.
గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆపి వేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, ఆన్ ఆఫ్ చేయొద్దు. వెంటనే అగ్నిమాపక, గ్యాస్ కంపెనీల సాయం కోరాలి.
మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయొద్దు. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివిస్టౌ దగ్గర నిల్వ ఉంచరాదు.
గోదాముల్లో..
వస్తు నిల్వలను చెక్క స్లీపర్లపై నిల్వ చేయాలి.
గోదాం బయట వస్తువులను నిల్వ చేయరాదు. పరిసర ప్రాంతాల్లో పొగతాగడం వంటివి నిషేధించాలి.
వివిధ రకాల వస్తువులను స్టోరేజీ ర్యాకుల్లో విడివిడిగా నిల్వ చేయాలి.
గోదాముల్లో తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి.
వస్తు నిల్వల మధ్యలో గ్యాంగ్‌వే, క్రాస్‌వే సెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది.
వస్తువుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు ఆపివేయాలి.
వస్తు నిల్వలు 4, 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు. తప్పనిసరి అయితే నిల్వలకు పెకప్పు కనీసం రెండు అడుగుల దూరం ఉంచాలి.
గోదాం సమీపంలో తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
అప్రమత్తతే శ్రీరామరక్ష!
Published Sat, May 10 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement