
జయలలిత బంగ్లాలో అగ్నిప్రమాదం.. అనుమానాలు!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు తన గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకున్న సిరుతాపూర్ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది చెన్నై నగరానికి సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కువగా పోయెస్ గార్డెన్స్‌లోనే ఉండే జయలలిత, అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం ఈ బంగ్లాకు వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల ఆధీనంలో ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ బంగ్లాలో ఉంటున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు.
పార్టీ నుంచి కూడా దినకరన్ కుటుంబాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ప్రమాదంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆ బంగ్లాలోనే జయలలిత ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. జయలలితకు ఉన్న మొత్తం ఆస్తులలో పోయస్ గార్డెన్ బంగ్లాతో పాటు సిరుతాపూర్ బంగ్లా కూడా చాలా ఖరీదైనది. ఇందులో ఇప్పుడు భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తుల వివరాలు బయటకు రాకుండానే ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.