ప్రతిపక్షాలపై జయ ఫైర్
Published Tue, Feb 4 2014 3:55 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి :‘‘ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రగతితో పట్టింపులేదు, సంక్షేమ కార్యక్రమాలతో సంబంధం లేదు, వారికి కావలసిందల్లా అధికార పక్షంపై దుమ్మెత్తిపోయడమే’’అంటూ అసెం బ్లీలో సోమవారం నాటి సమావేశంలో ముఖ్యమంత్రి జయలలిత నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం తరువాత అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. కొందరు ప్రశంసించారు, కొందరు సూచనలు చేశారు. అయితే కొన్ని పార్టీలు మాత్రమే అదేపనిగా విమర్శలు గుప్పించాయన్నారు. ప్రసం గంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు. పథకాల అమలు లో లోటుపాట్లు సహజం అలాగని అన్నింటినీ ఒకే గాటిన కట్టేస్తే సహిం చబోమని ఆమె హెచ్చరించారు.
నూరుశాతం అక్షరాస్యత
రా్రష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జయ తెలిపారు. విద్యాభివృద్ధికి రూ.16,967కోట్లు కేటాయించి 23 లక్షల మంది విద్యార్థులకు వివిధ వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు. విద్యతోపాటూ వికాసానికి దోహదపడేలా చెస్ పోటీలను ప్రవేశపెట్టగా 11 లక్షల 25 వేల మంది పోటీల్లో పాల్గొన్నారని చెప్పా రు. 6,194 పాఠశాలల్లో 1-6 తరగతుల వారికి ఆంగ్లబోధన అమలు చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత
నేటి వరకు 51,757 మందితో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని వివరించారు. విద్యతో పాటూ వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. వైద్య విధాన పరిషత్ ద్వారా 2,374 మంది డాక్టర్ల నియామకం జరిగిందని అన్నారు. వీరుగాక కాంట్రాక్టు పద్ధతిపై 4361 డాక్టర్లు, 922 మంది ఇతర వైద్య సిబ్బంది నియామకం జరిగిందని తెలిపారు.
విద్యుత్ కోతలకు త్వరలో స్వస్తి
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడే పరిస్థితులు ఆసన్నమైనందున త్వరలో కోతలను ఎత్తివేస్తామని జయ హామీ ఇచ్చారు. మెట్టూరులో 600 మెగావాట్లు, వల్లూరులో 800 మెగావాట్ల అదనపు ఉత్పత్తిని సాధించామని అన్నారు. 9వేల మెగావాట్లుగా ఉన్న ఉత్పత్తిని గత నెల 27 నాటికి 12,790 మెగావాట్లకు తీసుకొచ్చామని అన్నారు. సెంట్రల్ గ్రిడ్ నుంచి రావలసిన 2,500 మెగావాట్ల ఉత్పిత్తి నిలిచిపోవడం వల్లనే కోతలు తప్పలేదని తెలిపారు. కూడంకుళం నుంచి విద్యుత్ లభించే అవకాశం ఉన్నందున త్వరలో కోతలు ఎత్తివేస్తామని అన్నారు. ఢిల్లీ మాదిరిగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించకూడదంటూ సీపీఐ సభ్యులు సౌందరరాజన్ ప్రశ్నకు విద్యుత్ శాఖా మంత్రి నత్తం విశ్వనాథన్ బదులిస్తూ, ఢిల్లీ చార్జీలతో పోల్చుకుంటే తమ చార్జీలు తక్కువని, పైగా పేదలకు, రైతులకు ఉచిత, రాయితీలపై 13.6 లక్షల మందికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వివరించారు.
ప్రతిపక్షాల డుమ్మా
అనేక ప్రధాన అంశాలపై అసెంబ్లీ సమావేశాలు సాగుతుండగా సోమవారం నాడు ప్రతిపక్షాలన్నీ డుమ్మా కొట్టాయి. డీఎంకే, డీఎండీకే, పీఎంకే, పుదియ తమిళగం కట్చి పార్టీలకు చెందిన సభ్యులెవరు హాజరుకాలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్యాంకుల వ్యవహారంలో తమిళనాడుపై పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారంటూ అన్నాడీఎంకే సభ్యులు ఆరోపించగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవడంతో కొద్దిసేపు సమావేశాలు రసాభాసగా మారాయి.
Advertisement
Advertisement