సాక్షి, బెంగళూరు: ఆనందంగా సాగిపోతున్న ఎన్నో కుటుంబాల్లో వరదలు కల్లోలం రేపాయి. వరద పీడిత కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించడంతో పాటు జిల్లా ప్రజలు ఇప్పటికీ వరద భయంతో గడుపుతున్నారు. వరదల వల్ల మడికెరె తాలుకాలో ఒకే గ్రామంలో నాలుగు వివాహాలు రద్దయ్యాయి. భారీ వర్షాలకు ఆస్తి కోల్పోయి నిరాశ్రయులు కావడం దీనికి కారణం. మడికెరె తాలూకా కట్టెమాడు గ్రామంలో ఇటీవల నాలుగు కుటుంబాల్లో పెళ్లి ముహూర్తాలు ఖరారయ్యాయి. అయితే కావేరి నది తాకిడికి కట్టెమాడులోనే 34 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి తోడు ఆస్తినష్టం, ఇళ్లలో దాచుకున్న ధనం, ధాన్యం కూడా నీళ్లపాలయ్యాయి. పెళ్లిళ్ల కోసం తెచ్చుకున్న బంగారు ఆభరణాలు కూడా కొట్టుకుపోయాయి. ఫలితంగా ప్రస్తుతం వివాహం చేయలేక నిరాశ్రయులుగా మారారు. అటు ఆస్తులు కోల్పోయి, ఇటు పిల్లల పెళ్లి ఎలా చేయలో దిక్కుతోచక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
నాలుగు పెళిళ్లు వాయిదా
♦ ఎంబీ రేష్మా తండ్రి ఎంవై బషీర్ కాఫీ వ్యాపారం చేస్తుండేవాడు. ప్రవాహం కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. ఇటీవల బెంగళూరు యువకుడితో రేష్మా వివాహం ఖాయమైంది. వరద నష్టాల వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు.
♦ బీవీ కృష్ణప్ప, బీవీ జయంతిల కుమార్తె బీకే రేవతి వివాహం డిసెంబరు 1వ తేదీన జరగాలి. పెరుంబాడికి చెందిన యువకుడితో ఖాయమైంది. వరుణుడి బీభత్సంతో ఇల్లు మొత్తం నేలమట్టం కావడంతో నిరాశ్రయులుగా మారి పునరావాస కేంద్రంలో జీవిస్తున్నారు. పెళ్లి గురించి ఆలోచించడం లేదు.
♦ బీకే నారాయణ్, బీఎన్ చంద్రవతి కుమార్తె లతీశ్ వివాహం నవంబర్ 21, 22వ తేదీల్లో ఖరారు చేశారు. వీరికి ఉన్న ఏకైక ఆస్తి ఇల్లు మాత్రమే. అయితే వరదల్లో ఉన్న ఇల్లు కూడా పోవడంతో నిరాశ్రయులుగా మారారు.
♦ సెబాస్టియన్, రోసీ దంపతుల కుమార్తె ప్రిన్సి వివాహం సెప్టెంబరు 9వ తేదీన ఖాయం చేశారు. అయితే వరదల కారణంగా ఇంటితో పాటు ఉన్న ఆభరణాలు కొట్టుకుపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment