- రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ విద్యాసాగర్‌రావు
- కేంద్రం రూ. 2 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు వెల్లడి
- ఘనంగా అవతరణ దినోత్సవం
- అమరులకు ప్రముఖుల నివాళి
సాక్షి, ముంబై: అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 కోట్ల ప్యాకేజీ మంజూరు చేసిందని గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు.
పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాథలైన వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు. ఇందుకోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. గ్రామాల్లోని ప్రజల సహకారంతో వర్షపు నీటిని భద్రపరచుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నాసిక్‌లో జరిగే కుంభమేళాకు వచ్చే లక్షలాది భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిమగ్నమైందని వివరించారు.
భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దివంగత మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ పేరుతో ‘ప్రమోద్ మహాజన్ కౌసల్య వికాస్ యోజన’ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మేయర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.
అమర వీరులకు ఘన నివాళి
రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘన నివాళి అర్పించారు. అమరవీరుల స్తూపానికి ప్రముఖ రాజకీయ నేతలంతా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నగరంలోని హుతాత్మ చౌక్(అమరవీరుల స్మృతి చిహ్నం) వద్ద మేయర్ స్నేహల్ అంబేకర్, బీజేపీ, శివసేన మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే సునీల్ తట్కరే, ప్రకాశ్ బిన్సాలే, పార్టీ ముంబై మహిళా శాఖ అధ్యక్షురాలు చిత్ర వాఘ్, సంజయ్ తట్కరే తదితర నాయకులు, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు అశోక్ చవాన్, శివసేన నాయకురాలు నీలం గోర్హే, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠావలే తదితరులు నివాళులర్పించారు.
రైతు కన్నీళ్లు తడుస్తాం..
Published Fri, May 1 2015 10:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement