మందులోకి చికెన్ తక్కువైందని..
-మద్యం మత్తులో దాడి చేసుకున్నఅటవీ సిబ్బంది
-ఒకరి పరిస్థితి విషమం
-విషయం బయటకు రాకుండా అధికారుల గోప్యం
అహోబిలం: అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం మద్యం, చికెన్ తెచ్చుకున్నారు. పార్టీ చేసుకునూ క్రమంలో చికెన్ ముక్కలు తక్కువయ్యాయి. దీంతో తాగిన మత్తులో ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన నియోజవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అహోబిలం అటవీ కార్యాయంలో సిబ్బంది, అధికారులకు ఎప్పుడు వీలైతే అప్పుడు పార్టీలు చేసుకోవడం పరిపాటి. ఈ క్రమంలో శుక్రవారం కూడా సిబ్బంది అందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నారు. దీంతో మద్యం, చికెన్ తెచ్చుకుని కార్యాలయంలో మద‍్యం సేవించారు. అంతలో మద్యం చాలక పోవడంతో మదార్ అనే సిబ్బంది షాపుకు వెళ్లాడు. అతను వచ్చేలోపు మద్యం సేవిస్తున్న వారు చికెన్ తిన్నారు. అంతలో మద్యంతో వచ్చిన మదార్ తనకు చికెన్ లేదని అక్కుడున్న సిబ్బందిని, అధికారులను దుర్భాషలాడాడు.
దీంతో మాట మాట పెరిగి సిబ్బంది రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు అరుపులు కేకలు చేసుకుంటూ దాడులు చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ వర్గం కార్యాలయంలో ఉన్న కర్ర (బడె) తీసుకుని మదార్ పై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాలు మదార్ మృతి చెందాడని అక్కడ నుంచి పరుగులు తీశారు. కానీ మదార్ కదలడంతో పక్కనున్న వారు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం.
పరుగులు తీసిన ప్రజలు, భక్తులు
ప్రభుత్వ అటవీ కార్యాలయంలో ఒక్క సారిగా సిబ్బంది కేకలు వినిపించడం, అసహ్యంగా బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంతే కాకుండా కార్యాలయం నుంచి బయటకు వచ్చి రోడ్ల వెంట పరుగులు తీశారు. దీంతో అటవీ సిబ్బందిని చూసిన ప్రజలు, దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో పరుగులు తీశారు. సుమారు అరగంట పాటు అక్కడ యుద్దవాతారణం తలపించినట్లు స్థానికులు చెపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి మద్యం మత్తులో ఇలా తన్నుకోవడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి జరిగినట్టు తెలియదు
నేను రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నాను. అహోబిలంలో జరిగిన సంఘటన నా దృష్టికి వచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గాయాలై హాస్పిటల్ కు వెళ్లినట్టు తెలియదు. మద్యం మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలో ఉన్న ఓ అధికారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన్టటు నా దృష్టికి వచ్చింది. దాడి చేసుకున్నట్టు నాకు తెలియదు. అటువంటిది ఏదైనా జరిగి ఉంటే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- రాంసింగ్, అటవీ రేంజ్ అధికారి