
కెంపాపురలో పక్కకు వాలిన నాలుగు అంతస్తుల భవనం
కర్ణాటక,బనశంకరి: బెంగళూరులో భవనాలు కుంగిపోవడం, బీటలు వారడం, పక్కకు వాలిపోవడం పరిపాటిగా మారిపోయింది. నగరంలో మరో నాలుగు అంతస్తుల కట్టడం పక్కకు వాలిపోవడంతో కట్టడంలో ఉన్న ప్రజలు భయంతో కట్టడం ఖాళీ చేశారు. హెబ్బాల కెంపాపురలో నాలుగు అంతస్తుల భవనంలో ప్రైవేటు హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా భవనం పక్కకు వాలిపోవడంతో భవనంలో నివసిస్తున్న కుటుంబాలు, పీజీ వాసులు బయటకు పరుగులు తీశారు. తక్షణం అగ్నిమాపకసిబ్బంది, పోలీసులకు సమాచారం అందించడంతో అమృతహళ్లి పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పక్కన పునాది తవ్వడంతో ప్రమాదం
అగ్నిమాపక సిబ్బంది భవనంలో ఎక్కడ పగుళ్లు, బీటలు ఏర్పడ్డాయి అనే దానిని పరిశీలించారు. అలాగే పాలికె అదికారులు కూడా చేరుకుని భవనాన్ని పరిశీలించి అక్కడ ఉన్న నివాసప్రజలను వేరే చోటుకు తరలించారు. పాలికె అధికారులు విలేకరులతో మాట్లాడుతూ కట్టడం యజమాని రాహుల్ పీజీ నిర్వహిస్తుండగా, భవనం వెనుక భాగంలో ఇల్లు నిర్మించడానికి బాబు అనే వ్యక్తి పునాది తీశారు. సుమారు 5 నుంచి 8 అడుగుల మేర పునాది తీయడంతో పీజీ భవనం పక్కకు వాలిందన్నారు. వాలిన భవనాన్ని తొలగించడం కోసం చుట్టుపక్కల ఇళ్లవాసులను ముందుజాగ్రత్తగా వేరే స్థలానికి వెళ్లాలని మనవిచేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా పునాది తవ్వారని దీని వల్ల భవనం పక్కకు వాలిందని ఇరుగుపొరుగు నివాసులు ఆరోపించారు. ఈ ఘటన పై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.