
కూలడానికి సిద్ధంగా ఉన్న భవనం.. ,కూలి అదృశ్యమైన దృశ్యం
కర్ణాటక,శివాజీనగర: బెంగళూరులో ఒక భవనం క్షణాల్లో కుప్పకూలింది. మంగళవారం రాత్రి 9:15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే పేకమేడలా నేలరాలింది. ప్రమాదాన్ని ఊహించి జనం ముందే భవనాన్ని ఖాళీ చేయడంతో పెద్ద గండం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళితే.. నగరం నడిబొడ్డున ఎస్‌సీ రోడ్డు, కపాలి థియేటర్ వెనుకభాగంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. థియేటర్‌ను కూల్చి కొత్త భవనం నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే నాలుగు అంతస్తుల భవనం ఉండగా దానిని లాడ్జ్, హోటల్‌గా ఉపయోగించేవారు.
ఇటీవల భారీ వర్షాలు కురవడం, భవనం సమీపంలోనే కొత్త కట్టడానికి తవ్వకాలు జరుగుతుండడంతో ఈ పాత భవంతి కూలినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనను కొందరు స్థానికులు తమ మొబైల్‌ఫోన్లలో చిత్రీకరించగా, వైరల్ అయ్యింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పక్క భవనం ఇంజనీర్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మేయర్ గౌతంకుమార్ జైన్ పరిశీలించారు.