పొద్దున్నే వస్తానంటివి కదా నాయనా..
Published Sat, Mar 18 2017 10:56 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
► నలుగురిని మింగిన జనరేటర్ పొగ
► ప్రాణం తీసిన గాఢనిద్ర లింగసూగూరు
► ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
రాత్రి లేటైంది. అక్కడే పడుకుని పొద్దున్నే వస్తానంటివి కదా నాయనా.. అంటూ జనరేటర్ పొగతో ఊపిరాడక మృతి చెందిన నలుగురు యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో లింగసూగూరు ఆస్పత్రి దద్దరిల్లింది. చేతికి వచ్చిన కొడుకులు మలివయస్సులో తమకు అండగా ఉంటారని ఆశించిన ఆ తల్లిదండ్రులు నిచ్చేతన స్థితిలో పడి ఉన్న తమ తనయుల మృతదేహాల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.
లింగసూగూరు: పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున నలుగురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కరడకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన నలుగురు యువకుల తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతులు నలుగురూ వారి తల్లిదండ్రులకు ఒక్కరే మగ సంతానం కావడం మరింత బాధాకరం.
ఘటన జరిగిందిలా..
కరడకల్ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు స్థానిక తపాలా కార్యాలయం ఎదుట ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లోని సెల్లార్‌లో ఉన్న చేతన్ సౌండ్ సర్వీస్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో విద్యుత్ సరఫరా స్తంభించింది. శుక్రవారం ఆనెహసూరు గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ యువకులు గురువారం రాత్రి అక్కడికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని 12 గంటల సమయంలో అంగడి వద్దకు చేరుకున్నారు. వారికి అంగడి యజమాని ప్రకాష్ భోజనాలు చేయించి ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి కావడంతో యువకులు అంగడిలోనే నిద్రించాలనుకున్నారు. ఆరుగురిలో బసవరాజ్ అనే యువకుడు కరెంట్ లేకపోవడంతో తనకు గదిలో నిద్రరాదని, తాను బయటే పడుకుంటానని చెప్పి అంగడి బయట మెట్లపై నిద్రించాడు. మిగతా ఐదుగురు అంగడిలో పడుకొని అక్కడే ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసుకుని ఫ్యాన్ వేసుకుని నిద్రించారు.
కొంతసేపటి తర్వాత జనరేటర్ శబ్దానికి నిద్ర రావడం లేదని మెట్లపై పడుకొన్న బసవరాజ్ జనరేటర్‌ను ఆఫ్ చేస్తుండటంతో లోపల పడుకొన్న ఓ యువకుడు జనరేటర్‌ను లోపలకు పెట్టుకుని షటర్ వేసుకున్నాడు. దీంతో జనరేటర్ నుంచి వెలువడే పొగ బయటకు వెళ్లే మార్గం లేక గదిలోనే నిండిపోయింది. గాఢనిద్రలో ఉన్న యువకులు ఊపిరాడక మృతిచెందారు. ఉదయాన్నే సంస్థ నిర్వాహకుడు ప్రకాష్ యువకులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పక్కనే మెట్ల వద్ద నిద్రించిన బసవరాజ్‌ను లేపడంతో ఇద్దరు కలిసి లోపలి వారిని లేపేందుకు ప్రయత్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో షట్టర్‌ను పైకెత్తి చూడగా, లోపల ఉన్న ఐదుగురూ ఎంతకీ లేవకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నలుగురు మరణించినట్లు ధ్రువీకరించారు. వారిలో విషమంగా ఉన్న సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం బాగలకోటె ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement