Wood Gas Vehicles: Firewood In The Fuel Tank, కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి.. - Sakshi
Sakshi News home page

కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..

Published Sun, Mar 6 2022 5:24 AM | Last Updated on Sun, Mar 6 2022 12:50 PM

Wood Gas Vehicles: Firewood In The Fuel Tank - Sakshi

కారు నడవాలంటే పెట్రోలో, డీజిలో కొట్టించాలి.. లేదంటే ఎల్పీజీ, సీఎన్జీ నింపుకోవాలి.. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ కాసిన్ని కర్ర ముక్కలను ట్యాంక్‌లో పడేసి కారు నడిపేయగలిగితే.. భలేగా ఉంటుంది కదా! ఇదేదో భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ కాదు.. ఎప్పుడో వందేళ్ల కిందటిదే. దానితో కార్లే కాదు.. బైకులు, బస్సులు కూడా నడిపేశారు. అసలు కర్ర ముక్కలతో కారు నడపడం ఏమిటి? ఎలా నడిచేవి? మరి ఇప్పుడెందుకు వాడటం లేదో తెలుసుకుందామా?     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

18వ శతాబ్దం తొలినాళ్ల నాటికే యూరప్‌ అంతటా పారిశ్రామికీకరణ పెరిగింది. కానీ కరెంటు వినియోగం ఇంకా విస్తృతం కాలేదు. బొగ్గు, పెట్రోల్‌తో పాటు సహజ వాయువు (సీఎన్‌జీ)ను వినియోగించేవారు. వీధి దీపాలకూ సీఎన్‌జీని వాడేవారు. వాటి ధర ఎక్కువ. కొరత కూడా. అందుకే బొగ్గు, కలప, బయోమాస్‌ వంటివాటిని వినియోగించి సింథటిక్‌ గ్యాస్‌ (సిన్‌గ్యాస్‌)ను తయారు చేసి.. పరిశ్రమల్లో, వీధి దీపాల కోసం వినియోగించడం మొదలుపెట్టారు.

అయితే 19వ శతాబ్దం మొదలయ్యే సరికి.. ఈ సాంకేతికత జనానికి అందుబాటులోకి వచ్చింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చాయి. పెట్రోల్, సీఎన్‌జీలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. దానికితోడు మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావంతో పెట్రోల్, సీఎన్‌జీ కొరత మొదలైంది. ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కార్లు, బైకులు, ఇతర వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనం అవసరమైంది. అప్పుడే ‘ఉడ్‌ గ్యాస్‌ జనరేటర్‌’ తెరపైకి వచ్చింది.  

ఏమిటీ  ‘సిన్‌ గ్యాస్‌’? 
గాలి చొరబడకుండా మూసేసిన కంటెయినర్లలో కలప, బొగ్గును వేసి, బయటి నుంచి వేడి చేస్తారు. దీనివల్ల బొగ్గు, కలప మండిపోకుండానే.. వాటి నుంచి నైట్రోజన్, హైడ్రోజన్, మిథేన్, కార్బన్‌ మోనాక్సైడ్‌ కలిసి ఉన్న గ్యాస్‌ విడుదలవుతుంది. సాధారణ వంట గ్యాస్‌ (ఎల్పీజీ) లాగానే ఈ గ్యాస్‌కు మండే లక్షణం ఉంటుంది. దానిని పరిశ్రమల్లో, వీధి దీపాల కోసం, ఇళ్లలో వంట కోసం వినియోగించేవారు. 1807లోనే లండన్‌లో తొలిసారిగా ‘సిన్‌ గ్యాస్‌’ ద్వారా వీధి దీపాన్ని వెలిగించారు. అలా మొదలై 19వ శతాబ్దం మొదలయ్యే నాటికి ఈ గ్యాస్‌ను వాడకం బాగా పెరిగింది. విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ గ్యాస్‌తోనే పరిశ్రమలు నడిచాయి. 

ఫ్రెంచ్‌ ఇంజనీర్‌  ఆవిష్కరణతో..
పెట్రోల్, సీఎన్జీకి బదులు సిన్‌గ్యాస్‌ను వాడొచ్చని గుర్తించిన ఫ్రెంచ్‌ ఇంజనీర్‌ జార్జెస్‌ ఇంబర్ట్‌.. 1920లో మొబైల్‌ ఉడ్‌ గ్యాస్‌ జనరేటర్‌ను రూపొందించారు. కర్ర ముక్కలతో సిన్‌ గ్యాస్‌ ఉత్పత్తి అయ్యేలా చేశారు. అందుకే దాన్ని‘ఉడ్‌ గ్యాస్‌’గా పిలిచారు. వాహనాల ఇంజన్‌లో  మార్పులు చేసి ‘ఉడ్‌ గ్యాస్‌’తో నడిచేలా మార్చారు. అప్పటికి పెట్రోల్, సీఎన్జీ ఉండటంతో దీనికి డిమాండ్‌ రాలేదు.

1930 చివరికి  9 వేల వాహనాలు ఇంబర్ట్‌ జనరేటర్‌లతో నడిచేవి. కానీ రెండో ప్రపంచ యుద్ధం ప్రభావంతో మళ్లీ పెట్రోల్, సీఎన్జీల కొరత మొదలైంది. ధరలూ పెరగడంతో..‘ఇంబర్ట్‌ జనరేటర్లకు డిమాండ్‌ పెరిగింది. 1940–42 నాటికి ఒక్క జర్మనీలోనే 5 లక్షల వాహనాలు ‘ఉడ్‌ గ్యాస్‌’తో నడిచినట్టు అంచనా. కర్ర ముక్కల కోసం 3 వేలకుపైగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్‌ సహా యూరప్‌ దేశాల్లో ‘ఉడ్‌ గ్యాస్‌’ వాడారు. 

‘ఉడ్‌ గ్యాస్‌’ వాడటం ఆపేశారెందుకు? 
పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వంటివాటితో పోలిస్తే.. ఉడ్‌ గ్యాస్‌లో వాయువులకు మండే సామర్థ్యం తక్కువ. దాని నుంచి విడుదలయ్యే శక్తి కూడా తక్కువ. కొద్దికిలోమీటర్లు ప్రయాణించాలంటే కిలోల కొద్దీ కలప  కావాల్సి వచ్చేవి. పైగా మెల్లగా వెళ్లాల్సి వచ్చేది. 
ఉడ్‌గ్యాస్‌ జనరేటర్, ఇతర పరికరాల బరువు వందల కిలోలు ఉంటుంది. జనరేటర్‌ను కార్లు, బస్సులు, ఇతర వాహనాల వెనుక అదనపు టైర్లతో అమర్చుకోవాలి, దాని నుంచి వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేసే ట్యాంకు, కూలింగ్‌ యూనిట్‌కు పైపులతో అమర్చాలి. నిర్ణీత దూరం తర్వాత వాహనం ఆపి.. జనరేటర్‌లో కర్ర ముక్కలను నింపాలి. వాహనం కూడా మెల్లగా గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి వచ్చేది. 
బైకుల కోసం చిన్న జనరేటర్లు వచ్చినా.. కొద్దిదూరమే ప్రయాణించగలిగేవారు. 
ఉడ్‌ గ్యాస్‌ వాహనాన్ని ఎప్పుడంటే అప్పుడు వెంటనే స్టార్ట్‌ చేయడానికి కుదరదు. జనరేటర్‌ వేడెక్కి తగిన స్థాయిలో గ్యాస్‌ వెలువడేందుకు 15 నిమిషాలైనా పడుతుంది. అప్పటిదాకా ఆగాల్సిందే. 
ఈ గ్యాస్‌లో ఉండే కార్బన్‌ మోనాక్సైడ్‌ విషపూరిత వాయువు. అందుకే జనరేటర్‌ నుంచి పైపును కారు బయటిభాగం నుంచే ఇంజన్‌కు అనుసంధానించేవారు. 
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ పె ట్రోల్, సీఎన్జీ ఇంధనాలు సులువుగా దొరకడం, ఎక్కువ మైలేజీ ఇచ్చే టెక్నాలజీలు వచ్చాయి. దీంతో ‘ఉడ్‌ గ్యాస్‌’ జనరేటర్లు మూలకుపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement