- ఎగువ సభ అభ్యర్థిత్వాలకు కాంగ్రెస్ నేతలు క్యూ
- మొత్తం 11 స్థానాలు ఖాళీ
- 27న నోటిఫికేషన్
- వచ్చే నెల 20న ఓటింగ్, 24న ఫలితాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికల్లో అ భ్యర్థిత్వాలను దక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. శాసన సభ నుంచి శాసన మండలికి ఏడుగురిని, రాజ్యసభకు నలుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. జూన్‌లో వీటికి ఎన్నికలు జరుగుతాయి. 122 మంది సభ్యులు కలిగిన కాంగ్రెస్ శాసన మండలికి సునాయాసంగా నలుగురిని పంపగలుగుతుంది.
రాజ్యసభకు కూడా ఇద్దరు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. శాసన మండలి అభ్యర్థిత్వాల కోసం కాంగ్రెస్‌లో సుమారు వంద మంది పోటీ పడుతున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తొలి వరుసలో ఉన్నారు. ఇంకా హెచ్‌ఎం. రేవణ్ణ, గుర్రప్ప నాయుడు, మంజులా నాయుడు, సీఎం. ఇబ్రహీం, వీఆర్. సుదర్శన్, బీఎల్. శంకర్ లాంటి వారు కూడా పోటీ పడుతున్నారు.
షెడ్యూల్ విడుదల
శాసన మండలిలో వచ్చే నెల 30వ తేదీకి ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు మంగళవారం ఎన్నికల కార్యక్రమం విడుదలైంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం...ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ మూడో తేది వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నాలుగున పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 6న తుది గడువు. అవసరమైతే అదే నెల 20న ఎన్నికలు నిర్వహిస్తారు. 24న ఓట్ల లెక్కింపు చేపడతారు.
కర్ణాటక ఆగ్నేయ పట్టభద్రుల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ ఏహెచ్. శివయోగి స్వామి, బెంగళూరు ఉపాధ్యాయుల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టన్నలు వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కర్ణాటక ఈశాన్య ఉపాధ్యాయ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శశిల్ జీ. నమోషి, కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన మోహన్ ఏ. లింబికాయ్‌లు ఇదివరకే రాజీనామా చేశారు.