నగర వ్యాప్తంగా వైఫై హాట్‌స్పాట్స్
వైఫై ఏర్పాటు కోసం జులైలో టెండర్లు
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఆప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శి(ఐటీ) ఆదర్శ్ శాస్త్రి మాట్లాడుతూ రానున్న రెండేళ్ల కాలంలో నగరమంతటా వైఫై అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2016 నాటికి ఏడు వందల వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా రెండేళ్ల కాలంలో వైఫై అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెలికాం న్యూస్ పోర్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టెలీ అనాలిసిస్’పై చర్చా కార్యక్రమంలో ఆదర్శ్ శాస్త్రి ప్రసంగించారు. జూన్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీని కోసం కేటాయింపులు జరుపుతారని పేర్కొన్నారు.
అనంతరం జులైలో టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. 2016 కల్లా మొదటి దశలో 600 నుంచి 700 వరకు వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో నగరవ్యాప్తంగా వైఫై అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెలికాం కంపెనీలకు శాస్త్రి కొన్ని సూచనలు చేశారు. టెలికాం కంపెనీలు ప్రజలకు ఉచిత వైఫై సదుపాయం కల్పించినట్లయితే ప్రకటనల రూపంలో అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. నగరంలో 40 లక్షల మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, ఉచిత వైఫైని వారు ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పారు.
అప్పుడు ప్రకటను వారి దరిచేరుతుందన్నారు. ప్రజలు కూడా ఉచిత వైఫై సదుపాయంతో అనేక అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తే అవినీతికి చెక్ పెట్టొచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ-మెయిల్, ఇతర వెబ్‌సైట్లను నిర్ణీత సమయంలోగా వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సినిమాలు చూడాలన్నా, డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని శాస్త్రి అన్నారు.
రెండేళ్లలో ఉచిత వైఫై
Published Thu, Apr 2 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement