పచ్చదనానికి పెద్దపీట
Published Sun, Feb 23 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
సాక్షి, న్యూఢిల్లీ: తన పరిధిలోని ప్రాంతాలన్నింటిలోనూ పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా గార్డెన్ హట్స్, సుగంధపార్క్‌లను ఏర్పాటుచేయనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) చైర్మన్ జలజ్ శ్రీవాస్త్తవ ఆదివారం తెలిపారు. ఎన్‌డీఎంసీ ప్రాంతం దేశంలోనే అత్యధిక పచ్చదనం ఉన్న మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. 2014- 15 ఎన్‌డీఎంసీ వార్షిక బడ్జెట్‌లో ఉద్యానవనాలు, పార్కుల కోసం రూ.75.2 కోట్లను కేటాయించినట్లు శ్రీవాస్తవ తెలిపారు.
లక్ష్మీబాయినగర్, సరోజినీనగర్ పార్కుల్లో విభిన్న రకాల గార్డెన్ హట్స్ ఏర్పాటుచేయనున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. లక్ష్మీబాయినగర్‌లోనే సుగంధపార్క్‌ను అభివృద్ధి చేస్తారు. లోధీగార్డెన్ నర్సరీలో కాక్టస్‌హౌస్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. సరోజినీనగర్, మాల్చామార్గ్, జోర్‌బాగ్‌లోని పార్కుల్లో పది ఆక్యుప్రెషర్ ఉద్యానబాటలను నిర్మిస్తారు. వయోధికుల కోసం పార్కుల్లో గులకరాళ్లతో పది మీటర్ల పొడవు ఆక్యుప్రెషర్ మార్గాలను రెయిలింగ్‌లు సహా ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. సర్క్యులర్ రోడ్డు నర్సరీలో గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తారని శ్రీవాత్సవ వివరించారు. తాల్‌కటోరా గార్డెన్‌లో టోపియరీ గార్డెన్‌ను అభివృద్ధి చేసే పనులు కొనసాగుతున్నాయని ఎన్‌డీఎంసీ ప్రకటించింది.
ఉద్యానవనాల నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎన్‌డీఎంసీ ప్రారంభించిన స్కూల్ ఆఫ్ గార్డెనింగ్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 2,700 మంది ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చిందని శ్రీవాస్తవ చెప్పారు. స్కూళ్లు, ఆర్‌డబ్ల్యూఏలు, ఎకో-క్లబ్‌లు, సాధారణ ప్రజలు ఈ స్కూలులో శిక్షణ పొందవచ్చంటూ ఆయన ఆహ్వానించారు. శాంతిపథ్‌కు ఇరువైపులా ఉన్న సెంట్రల్‌వెజ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ 33 బహిరంగ ప్రదేశాల్లో పర్యావరణ సన్నిహిత వ్యాయామశాలలనూ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ వాస్తవ చెప్పారు. వీటిని ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
Advertisement